లిఫ్ట్ ఇచ్చినట్లు నటించి.. బంగారు గొలుసు కత్తిరించి..
బి.కోడూరు : బస్సు కోసం వేచి ఉన్న ఓ ఉపాధ్యాయురాలికి లిఫ్ట్ ఇస్తాం రమ్మంటూ కారులో ఎక్కించుకుని వెళ్లి ఆమె మెడలోని బంగారు గొలుసును చోరీ చేసిన ఉదంతమిది. వివరాలు ఇలా.. స్థానిక కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వరలక్ష్మి మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో పాఠశాల సమయం ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు మండలంలోని కాసానగరం, ఐత్రంపేట గ్రామాల సమీపంలో రోడ్డుపై బస్సు కోసం వేచి ఉంది. ఇదే సమయంలో కారులో వెళుతున్న కొంత మంది వాహనం ఆపి తాము పోరుమామిళ్లకు వెళుతున్నాం, వస్తారా అని అడిగారు. మోసాన్ని గమనించని ఉపాధ్యాయురాలు కారులో ఎక్కారు. కొంత దూరం వెళ్లే సరికి వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి కారు ఆపి దిగి చూసుకోగా మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు కత్తిరించి దొంగిలించినట్లు గుర్తించారు. ఈ మేరకు బద్వేలు రూరల్ సీఐ నాగభూషణ్‌కు ఫిర్యాదు చేశారు. సీఐ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయన వెంట బద్వేలు రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్, ఎస్‌బీ కానిస్టేబుల్ జయరామిరెడ్డి, బి.కోడూరు పోలీసులు ఉన్నారు. అనంతరం సీఐ మీడియాతో మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తుల వాహనాలలో ఎక్కితే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, వారి వెంట లిఫ్ట్ అడగడం మంచిది కాదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment