అప్పుల బాధ తాళలేక వ్యక్తి అదృశ్యం
కమలాపురం : కమలాపురం పట్టణం పకీరు వీధికి చెందిన షేక్ అబ్దుల్ జలీల్ అప్పుల బాధ తాళలేక ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. జలీల్ భార్య రజియా తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తన భర్త ఏడాదిన్నర క్రితం బైపాస్ సర్జరీ చేసుకున్నాడని, తమ వద్ద డబ్బు లేక పోవడంతో అప్పు చేసి ఆపరేషన్ చేయించుకున్నామని ఆమె తెలిపారు. ఆపరేషన్ చేయించుకోవడంతో ఏ పని చేయలేక తన భర్త ఇంటి వద్దనే ఉంటున్నాడని ఆమె అన్నారు. కాగా తన చిన్న కుమారుడు చదువు కుంటున్నాడని, పెద్ద కుమారుడితో కలసి టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో అప్పులు ఇచ్చిన వారు తన భర్తను ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఇవ్వాలని తీవ్రంగా హెచ్చరిస్తుండటంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తన భర్త ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నారు. సాయంత్రం 4.45 నిమిషాలకు వేరే నెంబర్‌తో ఫోన్ చేసి అప్పుల బాధ భరించలేక నేను ఇంటి నుంచి వచ్చేశానని, తన కోసం వెతకవద్దని కన్నీరు పెట్టాడని ఆందోళన వ్యక్తం చేశారు. 2–3 రోజుల్లో తన నుంచి ఫోన్ వస్తే బతికి ఉన్నట్లు అని, లేకపోతే చనిపోయానని అర్థం చేసుకోవాలని చెప్పాడన్నారు. ఎక్కడున్నావని అడుగుతుండగానే ఫోన్ కట్ చేశాడని, తిరిగి అదే నెంబర్‌కు తాను ఫోన్ చేస్తే ఎవరో ఫోన్ ఎత్తి అతను ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడని, ఇది కడప పాత బస్టాండు అని తెలిపాడన్నారు. తన కుమారునితో కలసి కడప నగరం అంతా కలియ తిరిగామని, అయితే ఎలాంటి ఆచూకి లభించలేదని ఆమె పోలీసులను ఆశ్రయించారు. జలీల్ భార్య రజియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కమలాపురం పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment