‘గులియన్ బ్యారో సిండ్రోమ్’ (జీబీఎస్) అరుదైన ఈ వ్యాధి
కడప రూరల్: జిల్లా వ్యాప్తంగా జ్వరం.. జలుబు.. దగ్గు.. ఒళ్లు నొప్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ‘జీబీఎస్’ వ్యాధి కలవరం రేపుతోంది. ఎందుకంటే విరేచనాలు, జ్వరం తదితర జబ్బులు వచ్చి వెళ్లిన తరువాతనే.. ఒళ్లు నొప్పులతో ప్రధానంగా కాళ్ల నొప్పులతో ఈ ‘జీబీఎస్’ వ్యాధి ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలను ముందస్తుగానే తెలుసుకొని చికిత్స పొందితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పొరపాటున అప్రమత్తంగా లేకుంటే మాత్రం పెద్ద ప్రమాదాన్నే ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జాగ్రత్తలతోనే అడ్డుకట్ట
ఈ వ్యాధి అంటు వ్యాధి కాకపోవడం శుభపరిణామం. కాగా ముందస్తు జాగ్రత్తలతోనే ఈ అరుదైన వ్యాధికి అడ్డుకట్ట వేయవచ్చు. అంటే ఇతరుల నుంచి సంక్రమించే డయేరియా, జ్వరం, దగ్గు తదితర వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. ప్రధానంగా ఈ వ్యాధి ఎందుకొస్తుందో తెలుసుకోవాలి.. అవగాహన పెంచుకోవాలి. ఏదైనా జబ్బు వచ్చి వెళ్లిన తరువాత శరీరంలో ఏదైనా మార్పు వచ్చినా.. ప్రధానంగా నరాలు, కండరాలకు సంబంధించిన సమస్యలను గుర్తిస్తే తక్షణం వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.
పూణెలో నిర్ధారణ పరీక్షలు
ప్రస్తుతం ఈ వ్యాధి రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాగా జిల్లాకు సంబంధించి ఏ పెద్ద జబ్బొచ్చినా పెద్దాసుపత్రి (కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి)కి వెళ్లాల్సిందే. గత ప్రభుత్వ పాలనలో కరోనా వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికన అందుకు అవసరమైన వైద్య పరికరాలు, మందులు, సిబ్బందిని సిద్ధం చేశారు. ఫలితంగా కరోనాపై విజయం సాధించాం. తాజాగా ‘జీబీఎస్’ వ్యాధి సవాల్ విసురుతోంది. అయితే ఇక్కడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మాత్రం ఈ వ్యాధి నిర్ధారణకు ఎలాంటి పరికరాలు అందుబాటులో లేవు. అనుమానిత కేసులు ఏవైనా ఉంటే పూణేలోని ల్యాబొరేటరీకి పంపి వ్యాధిని నిర్ధారిస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈఎన్‌ఎంజీ, ఎన్‌సీఎస్ పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించాల్సి వుంది. ఈ పరీక్షలకు సంబంధించి కడప పెద్దాసుపత్రిలో ప్రత్యేకంగా నిధులను కేటాయించి పరికరాలను సిద్ధం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అవగాహన అవసరం
ఈ వ్యాధి మనకు లేదని, అజాగ్రత్తగా ఉండటం కంటే ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షల పరికరాలను ఏర్పాటు చేయడం, ఆరోగ్యశ్రీలో ప్యాకేజీని పెంచడం, జబ్బుపై ప్రజల్లో అవగాహన కల్పించడం మంచిది. అలాగే ఈ వ్యాధికి వాడే ఇంజెక్షన్లు ఇతర జిల్లాల్లో లేవని తెలుస్తోంది. ఇక్కడ మాత్రం ఉన్నాయనే సమాధానం వస్తోంది. అదే నిజమైతే మంచిదే. ఆపద సమీపంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించడంలో తప్పులేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
నాడీ వ్యవస్థను దెబ్బతీసే వ్యాధి
ఏదైనా జబ్బు వచ్చి వెళ్లిన తరువాత..
బయటపడుతున్న లక్షణాలు
అప్రమత్తంగా లేకుంటేఆపదలో పడినట్లే
ఈ కేసులు జిల్లాలో ఎక్కడా లేవంటున్న వైద్య ఆరోగ్య శాఖ
‘గులియన్ బ్యారో సిండ్రోమ్’ (జీబీఎస్) అరుదైన ఈ వ్యాధి
‘గులియన్ బ్యారో సిండ్రోమ్’ (జీబీఎస్) అరుదైన ఈ వ్యాధి
Comments
Please login to add a commentAdd a comment