అపురూప ఘట్టం.. మహానైవేద్యం
● వేలాదిగా తరలివచ్చిన భక్తులు
● వీరభద్రస్వామికి బంగారు కిరీటం, మూడో కన్ను ధరింప చేసిన వేదపండితులు
రాయచోటిటౌన్: రాయచోటిలోని శ్రీ వీరభధ్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అపురూప ఘట్టమైన మహానైవేద్యాన్ని వేదపండితులు ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ ప్రత్యేకత..
స్వామి వారికి రోజూ నైవేద్యం సమర్పిస్తారు. ఏడాదికి ఒకరోజు మహానైవేద్యం సమర్పిస్తారు. దీనికోసం స్వామికి రోజు వారి భత్యంలో భాగంగా ఒక సేరు బియ్యం చొప్పున 365 రోజులకు 365 సేర్లతో వండిన భోజనం, నెలకు ఒక సేరు బియ్యం ప్రకారం 12 నెలలకు 12 సేర్ల బియ్యంతో వండిన అత్తిరసాలు (నిప్పట్లు), వివిధ రకాల కూరగాయలతో వండిన వంటకాలతోపాటు పలు రకాల దుంపలు, గుమ్మడి కాయలు వండి రాశిగా పోస్తారు. ఈ వంటకాలను తెల్లవారుజామున మూడు గంటల నుంచే సుండుపల్లె మండలం శ్రీరామాపురానికి చెందిన భాస్కర్ కుటుంబ సభ్యులు తడిబట్టలతో మడికట్టుతో వండి సిద్ధం చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ. వేదపండితులు ప్రణవానందగిరి స్వామి (నర్రా వెంకట భాస్కర్ సిద్ధాంతి) శిష్యుడు శ్రీ మఠం ఓంకార్‌స్వామి ఆధ్వర్యంలో అన్నానికి పూజలు నిర్వహించాక తీసుకొచ్చి శ్రీ వీరభద్రస్వామి ఆలయం మధ్యలో రాశి పోశారు. అనంతరం వీరశైవులు, కన్నడ భక్తులు సిద్ధాంతి (వేదపండితుల) నుంచి అనుమతి తీసుకున్నాక కత్తులతో విన్యాసాలు చేస్తూ రాశిని కొల్లగొట్టారు. అనంతరం మట్లి వడియరాజులు రాశిలోకి దూసుకెళ్లి రెండు చేతులతో అందినంత తీసుకెళ్లారు. అనంతరం ప్రధాన అర్చకులు వేదపండితల సహాయంతో స్వామివారికి బంగారు కిరీట ధారణ చేసి తినేత్రం(మూడోకన్ను) ధరింపచేశారు. స్వామివారి త్రినేత్రం అన్నం రాశిపై పడుతుందని, అప్పుడు ఒక్క క్షణంపాటు ప్రకంపనలు వస్తాయని భక్తుల నమ్మకం. ఆ సమయంలో స్వామి వారికి ఎదురుగా ఎవరూ ఉండకుండా జాగ్రత్త వహిస్తారు. ఆలయ సిబ్బంది పోలీసు అధికారుల సహకారంతో మహానైవేద్యాన్ని స్వామి వారి దర్శనం చేసుకొని వెళ్లే వారికి విస్తర్లలో పంచిపెడతారు.
● మహానైవేద్యం కొల్లగొట్టాక మిగిలిన ప్రసాదాన్ని కన్నడ భక్తులు తీసుకొచ్చి ఆలయం వెలుపల విస్తర్లలో ఎండపెట్టుకున్నారు. ఎండిన తర్వాత వడియాలుగా మార్చుకొని తీసుకెళతారు. ఉపవాసాలు ఉన్న రోజుల్లో వండిన ప్రసాదంలో కలుపుకొని తింటామని వారు చెప్పడం విశేషం. ఆదివారం తెల్లవారుజామున 4–30కు అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, అర్చకులు శంకరయ్యస్వామి, కృష్ణయ్య స్వామి, శేఖర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.
వైభవం.. రథోత్సవం
శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామి వారి రథోత్స వం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా డప్పువాయిద్యాలు, కోలాటాలు, కర్ణాటక భక్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వీధు లన్నీ శ్రీ వీరభద్రుడి నామస్మరణతో మార్మోగాయి.
అపురూప ఘట్టం.. మహానైవేద్యం
Comments
Please login to add a commentAdd a comment