అధికారం అండతో ప్రభుత్వ స్థలం కబ్జా
కడప సెవెన్‌రోడ్స్ : అధికార తెలుగుదేశం పార్టీ నేతల అండతో కడప నగరంలో కబ్జాదారులు పెట్రేగిపోతున్నారు. కుంట, వాగు, వంక, నీటిమునక ఇలా ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతున్నాయి. కోట్లాది రూపాయలు విలువజేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోతున్నా నాయకుల ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. కానాల జయలత అనే మహిళ చిన్నచౌకు గ్రామ సర్వే నెంబరు 955లోని 10 సెంట్ల ప్రభుత్వ స్థలం తమదేనంటూ ఏకంగా బోర్డు నాటినా ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం.
కడప కార్పొరేషన్ 43వ డివిజన్ నిరంజన్‌నగర్ పరిధిలో సర్వే నెంబరు 955లోని 23 సెంట్లు ప్రభుత్వ నీటి మునక భూమి ఉంది. మీ భూమి వెబ్‌సైట్‌లో ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ ఒక సెంటు స్థలం రూ. 40 లక్షలు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో విలువైన స్థలం కావడంతో ఎలాగైనా కబ్జా చేసేందుకు ఎత్తులు వేశారు. ఇందులో భాగంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. కడప నగరం కుమ్మరకుంటకు చెందిన దాసరి సాల్మోన్‌కు 1953లో ప్రభుత్వం సదరు సర్వే నెంబరులోని 23 సెంట్ల పైకి 10 సెంట్లు పట్టాగా ఇచ్చారని డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. వారసత్వరీత్యా ఆయన కోడలు దాసరి మేరమ్మకు ఆ స్థలం సంక్రమించినట్లు చూపారు. ఆమె తన అవసరాల నిమిత్తం మృత్యుంజయకుంటకు చెందిన కానాల జయలతకు రూ. 29,04,000లకు విక్రయించినట్లు చెబుతూ 2018 ఏప్రిల్ 4వ తే ఛీఠీ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో ఆ స్థలాన్ని తాము కొనుగోలు చేిసినట్లు, దానిపై తమకు సంపూర్ణ హక్కులు ఉన్నట్లు చెబుతూ కె.జయలత బోర్డు పాతారు. బోర్డు స్టాడింగ్ ఆర్డర్స్–15–అండర్ సెక్షన్ 11 పేరా 2 ప్రకారం వాటర్ బాడీలు, వాటర్ కోర్సులు, కుంట పోరంబోకులను ఎవరికీ అసైన్‌మెంట్ లేదా అలియనేషన్ కింద దఖలు పరచరాదు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నీటి మునక, కుంట తదితర ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు అసైన్‌మెంట్ ఇచ్చేందుకు, రీ క్లాసిఫికేషన్ చేసేందుకు అధికారం లేదని రాష్ట్ర హైకోర్టు కూడా గతంలో స్పష్టం చేసింది. 2012 సెప్టెంబరు 14వ తేదీన రెవెన్యూశాఖ ద్వారా జీఓ ఎంఎస్ నెంబరు 571 సైతం ప్రభుత్వం జారీ చేసింది. నీటి పోరంబోకు భూముల కన్వర్షన్, కేటాయింపుల విషయంలో తమ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలంటూ సీసీఎల్‌ఏ కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు కూడా ఉన్నాయి. అయినా కూడా కె.జయలత 2018లో హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. అప్పటి కడప తహసీల్దార్ తరుపున కౌంటర్ అఫిడవిట్ దాఖలైంది. అది నీటి మునక ప్రాంతమని, దాన్ని రెవెన్యూ అధికారులు ఎవరికీ అసైన్ చేయలేదని కౌంటర్ అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. సదరు వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. వీఆర్‌ఓ ఇచ్చిన నివేదిక మేరకు చిన్నచౌకు సీఐ 2017 అక్టోబరు 1వ తేదీన దాసరి కొండయ్య, దాసరి చంద్రశేఖర్ అలియాస్ చందు, మరికొందరిపై ఎఫ్‌ఐఆర్ నెం. 262 నమోదు చేశారని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం కె.జయలత కౌంటర్ దాఖలు చేసుకోవచ్చని మాత్రమే చెప్పింది. అయినా ఆమె ఆ స్థలంలో ఓమారు బోర్డు పాతగా, రెవెన్యూ అధికారులు తొలగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతల అండ చూసుకుని ప్రభుత్వ బోర్డును తొలగించి ఆమె తన పేరిట ఒక బోర్డు పాతడం చర్చనీయాంశంగా మారింది.
రిజిస్ట్రేషన్ రద్దుకు ప్రతిపాదనలు
– కడప తహసీల్దార్
ఈ అంశంపై కడప తహసీల్దార్ నారాయణరెడ్డిని సాక్షి వివరణ కోరగా.. చిన్నచౌకు పొలం సర్వే నెంబరు 955లోని 23 సెంట్ల భూమి ప్రభుత్వ నీటి మునక ప్రాంతం కింద ఉందని స్పష్టం చేశారు. గతంలో ఓమారు ఆమె బోర్డును పాతగా తొలగించామన్నారు. మళ్లీ ఇప్పుడు బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆమె చేసుకున్న రిజిస్ట్రేషన్ చెల్లదని స్పష్టం చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వివరాలు సేకరించామన్నారు. ఆమె చేసుకున్న రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించామన్నారు. అప్పీలు చేసుకోవాలంటూ మాత్రమే వారికి కోర్టు సూచించింది తప్ప వారికి అనుకూలంగా ఎలాంటి తీర్పు ఇవ్వలేదన్నారు. బోర్డును తొలగించి రిజిస్ట్రేషన్ రద్దు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రెవెన్యూ రికార్డుల్లో నీటి మునకగా స్పష్టం
దొంగ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్
స్థలం తమదేనంటూ
బోర్డు సైతం నాటిన వైనం
చేష్టలుడిగి చూస్తున్న అధికారగణం
Comments
Please login to add a commentAdd a comment