విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
బ్రహ్మంగారిమఠం : మండలంలోని కొత్తబస్వాపురంలో తొర్రివేముల నాగరాజు (34) ఆదివారం సాయంత్రం వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాగరాజు చేపల వేట చేస్తుంటాడు, వ్యవసాయ పొలం వద్ద పందుల నివారణ కోసం విద్యుత్ ఏర్పాటు చేయడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బి.మఠం పోలీసులు కేసు నమోదు చేశారు.
మోరీని ఢీకొన్న వాహనాలు
వల్లూరు (చెన్నూరు) : చెన్నూరు సమీపంలోని జాతీయ రహదారిపై సబ్ స్టేషన్ ఎదురుగా కడపకు వెళ్లే దారిలో రెండు ద్విచక్ర వాహనాలు మోరీని ఢీకొనడంతో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. ప్రొద్దుటూరుకు చెందిన మనోహర్, ప్రభావతి దంపతులతో పాటు వీర కుమార్ విజయలక్ష్మిలు కడప నగరంలో ఓ శుభకార్యానికి బయలుదేరారు. వీరి వెనుక అతివేగంగా వచ్చే వాహనాలకు భయపడి తమ ద్విచక్ర వాహనాలను కొంచెం పక్కకు తిప్పుకునే క్రమంలో మోరీని ఢీకొన్నారు. దీంతో మనోహర్ ప్రభావతి కిందపడటంతో స్వల్ప గాయాలయ్యాయి. కాగా, వీరి వెనుకే వస్తున్న వీరకుమార్, విజయలక్ష్మి కూడా ఇదే మోరీని ఢీకొన్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా అదే సమయంలో వెనుక నుంచి పలు వాహనాలు వేగంగా వీరి పక్కనే వెళ్లాయి. అదష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. మోరీని రోడ్డుపైన కట్టడమే ప్రమాదానికి కారణమని, గతంలో కూడా పలు ప్రమాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని గాయాలు
కడప అర్బన్ : కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మలుపు వద్ద బైకుపై వెళుతున్న దినేష్ (35)అనే వ్యక్తిని ఆదివారం ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో అతను తీవ్రంగా గాయ పడ్డాడు. స్థానికుల సహకారంతో ఆసుపత్రిలో చేరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గ్యాస్ లీకై వ్యక్తి మృతి
బి.కొత్తకోట : గ్యాస్ లీకై న సంఘటనలో తీవ్రంగా గాయపడిన స్థానిక ఖాజాఖాన్ వీధికి చెందిన లబ్బి అబ్దుల్ కరీం (65) బెంగళూరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో స్నానానికి వెళ్లగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. స్నానాల గది నుంచి బయటకు రాగానే కుటుంబీకులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే శరీరం కాలిపోవడంతో వైద్యం కోసం కుటుంబీకులు బెంగళూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment