వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను భయపెట్టే చర్యలు
కడప కార్పొరేషన్ : డైవర్షన్ పాలిటిక్స్‌తోపాటు వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను భయాందోళనకు గురిచేసేందుకే పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారని వైఎస్సార్ సీపీ నాయకుడు, వల్లూరు మాజీ సర్పంచ్ బూసిపాటి కిషోర్ విమర్శించారు. ఆదివారం కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోసాని కృష్ణ మురళి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చూస్తుంటే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీకి సంబంధించిన కార్యకర్తలను, క్యాడర్‌ను భయాందోళనకు గురిచేసే ప్రణాళిక జరుగుతోందని అర్థమవుతోందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం వల్లే తాను చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ పై మాట్లాడినట్లు పోసాని నేరాంగీకార పత్రంలో పేర్కొన్నట్లు చెబుతున్న తీరును చూస్తే పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఎంతగా వాడుకుంటుందో అర్థమవుతోందన్నారు. ఇదంతా జనసేన క్యాడర్‌ను అడ్డుపెట్టుకుని టీడీపీ ఆడుతున్న నాటకాలన్నారు.ఇలాంటి సంఘటనలకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుడు శ్రీరాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment