కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిందని, జనాభా ప్రాతిపదికన కానీ వైశాల్య ప్రాతిపదికన కానీ 42 శాతం కేటాయించాల్సిన బడ్జెట్‌లో 6 శాతం కేటాయించడం అంటే ఇది మోసకారి బడ్జెట్ అని వక్తలు విమర్శించారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని వైఎస్‌ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్‌లో రాష్ట్ర బడ్జెట్ – రాయలసీమ ఆకాంక్షలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల బాహుబలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. గత బడ్జెట్‌తో పోల్చుకుంటే ఇది తక్కువేనన్నారు. ఈ రకమైన అర కొర బడ్జెట్ ద్వారా మరో 50 ఏళ్లు అయినా కూడా రాయలసీమలో ఏ ఒక్క ప్రాజెక్టు, ఏ ఒక్క పరిశ్రమ పూర్తి కాదన్నారు. రాయలసీమ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే కనీసం రూ. 40 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు. అలాంటిది కేవలం రూ. 11 వేల కోట్లు రాష్ట్రమంతా కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారు చెప్పిన సూపర్ సిక్స్ హామీలే ప్రధాన కారణమని, అలాంటి హామీలను ఈరోజు విస్మరిస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతికి ఈ బడ్జెట్‌లో తావు లేకుండా చేసి వారిని నిలువునా మోసం చేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఈ బడ్జెట్‌లో ఏ మాత్రం నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఈ బడ్జెట్ నిలువునా మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సీపీ తదితర పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సదస్సులో వక్తలు
Comments
Please login to add a commentAdd a comment