మంత్రి అనుచరుల దందా!
చేతికందినంత...
ప్రొద్దుటూరు: శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని మహిళా మంత్రి అనుచరులు రైతుల ముసుగులో దోపిడీకి దిగారు. నాసిరకం కందులు తీసుకొస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ పరిధిలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోడౌన్‌కు వచ్చిన 600 కందుల బస్తాలకు గాను 386 బస్తాలను నాఫెడ్ అధికారులు నాసిరకంగా ఉన్నాయని తిరస్కరించారు. మరో లారీలో 607 బస్తాలకు గాను 180 బస్తాలను వెనక్కి పంపారు. ఇలా ప్రతి లారీలో పెద్ద సంఖ్యలో నాసిరకం కందులు తీసుకొస్తూ రూ.కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్ ద్వారా ఈ ఏడాది మద్దతు ధర చెల్లించి రైతులతో కందులను కొనుగోలు చేస్తున్నారు. ఇందుకుగాను క్వింటాల్ కందులకు రూ.7,550 చెల్లిస్తున్నారు. కొనుగోలుకు సంబంధించి నాఫెడ్ పలు నిబంధనలు ఉన్నా అధికార పార్టీ నేతలు వీటిని ఖాతరు చేయలేదు.
వెనక్కి పంపుతున్న అధికారులు
రొద్దం ప్రాంతం నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో కందుల లోడ్ లారీలు ఇక్కడికి వస్తున్నాయి. పరిస్థితిని గమనించిన అధికారులు ప్రతి లారీకి సంబంధించి ప్రతి బస్తాను తనిఖీ చేస్తున్నారు. సగానికి సగం పుచ్చుపట్టిన కందులు రావడంతో వెనక్కి పంపుతున్నారు. విషయం తెలుసుకున్న సదరు వ్యాపారులు అక్కడి అధికార పార్టీ నేతలతో అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారు. ఇలా చెడిపోయిన కందులను దించుకుంటే మున్ముందు తమ ఉద్యోగాలకు ముప్పు వాటిళ్లుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం లారీలోని సరుకును దించాలని వ్యాపారులు ఒత్తిడి చేయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. తమ లారీలు అన్‌లోడ్ చేయడం లేదని లారీ డ్రైవర్లు పోలీస్ స్టేషన్‌లోనే హల్ చల్ చేశారు.
అధికారుల తనిఖీ
విషయం తెలుసుకున్న తహసీల్దార్ గంగయ్య, ఆర్డీఓ ఎ.సాయిశ్రీతోపాటు త్రీటౌన్ సీఐ గోవిందరెడ్డి వేర్‌హౌస్ గోడౌన్‌కు వచ్చి కందులను తనిఖీ చేశారు. పరిస్థితిని గమనించి సత్య సాయి జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం గీత, వైఎస్సార్ జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం పరమల జ్యోతి వేర్ హౌసింగ్ గోడౌన్ వద్ద మకాం వేశారు. ఈ విషయంపై సత్యసాయి జిల్లా డీఎం విలేకరులతో మాట్లాడుతూ 1402 మంది రైతుల నుంచి కందులను సేకరించగా, ఇందులో 800 మందికి రూ.8కోట్ల 48 లక్షల 67వేల 425 చెల్లించామన్నారు. నాశిరకం కందులు వస్తున్న మాట వాస్తవమేనని, వీటిని రీ ప్రాసెస్ చేసుకుని తీసుకురావాలని వెనక్కి పంపుతున్నామన్నారు.
తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు
మంత్రి అనుచరులు రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పుచ్చు పట్టిన కందులను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్ముతున్నారని సమాచారం. ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటికే లారీల కొద్ది కందులను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన కందులను స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని గోడౌన్‌లో నిల్వ ఉంచుతున్నారు. నేరుగా రైతుల నుంచే ఈ కందులు కొనుగోలు చేశారా, ఎక్కడైనా గోడౌన్లలో నిల్వ ఉంచిన పాత కందులను తీసుకొస్తున్నారా అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వెనక్కి పంపుతున్నాం
గోడౌన్‌కు వస్తున్న కందుల బస్తాల్లో ఎక్కువగా నాసిరకం ఉన్నాయి. ప్రతి బస్తాను చెక్ చేస్తు న్నాం. కొంత కాలం గోడౌన్‌లో నిల్వ ఉంచి తర్వాత ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేస్తుంది. అప్పుడు కందులు సరిగా లేకుంటే మేంబాధ్యత వహించాల్సి వస్తుంది. – వెంకటస్వామి, వేర్ హౌస్ గోడౌన్ మేనేజర్, ప్రొద్దుటూరు
మంత్రి అనుచరుల దందా!
Comments
Please login to add a commentAdd a comment