
సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్
బద్వేలు అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని రామాంజనేయనగర్ సచివాలయం వార్డు పరిపాలన కార్యదర్శి కోనగిరిబాబును సస్పెండ్ చేస్తూ బుధవారం మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించడంతో పాటు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరై ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో సస్పెండ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
529 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 64 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 14592 మంది విద్యార్థులకుగాను 14063 మంది హాజరుకాగా 529 మంది గైర్హాజరయ్యారని ఆర్‌ఐవో తెలిపారు.
నేడు వైవీయూలో
క్యాంపస్ డ్రైవ్
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయ ప్లేస్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు వైవీయూ ప్రజాసంబంధాల విభాగ సంచాలకులు డాక్టర్ పి.సరిత తెలిపారు. దివీస్ లాబొరేటరీస్ లిమిటెడ్, శ్రీ చైతన్య స్కూల్స్ ప్రతినిధులు క్యాంపస్ ఎంపికలకు రానున్నారని వివరించారు. డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన విద్యార్థులు ఉద్యోగ ఎంపికలకు హాజరుకావాలని సూచించారు. కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్స్, సోష ల్ స్టడీస్ స్పెషలైజేషన్లను కలిగిన విద్యార్థులు విశ్వవిద్యాలయ నూతన పరిపాలన భవనంలోని ప్లేస్మెంట్ సెల్‌లో హాజరై ప్రయోజనం పొందాలని సూచించారు.
మహిళలు నైపుణ్యాన్ని
పెంపొందించుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : సమాజంలో మహిళలు వివిధ అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఐసీడీఎస్ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం నగర శివార్లలోని రిమ్స్ నర్సింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కౌమార బాలికలకు వృత్తి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి చాలా ప్రాముఖ్యమైనదని తెలిపారు. ప్రిన్సిపాల్ హిమగిరి కుమారి మాట్లాడుతూ నర్సింగ్ వృత్తిని స్వీకరించిన వారు సేవాభావంతో పని చేయాలని సూచించారు. కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థినిపై గెస్ట్ ఫ్యాకల్టీ
లైంగిక వేధింపులు
వేంపల్లె : ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థినిపై ఒంగోలు ట్రిపుల్ ఐటీ గెస్ట్ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆర్కే వ్యాలీ ఇన్‌ఛార్జి ఎస్‌ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు. బుధవారం విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు... ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఫిజిక్స్ గెస్ట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న తిరుపతిరావు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థిని ఆరోపించింది. మంగళవారం మధ్యాహ్నం విద్యార్థినిని అసభ్యకర పదజాలంతో మాట్లాడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపులకు పాల్పడిన అధ్యాపకుని ట్రిపుల్ ఐటీ నుంచి వెంటనే తొలగించాలని విద్యార్థిని డిమాండ్ చేసింది. కమిటీని వేసి విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment