కడప కల్చరల్ : ప్రముఖ పర్యాటకప్రాంతం, ఇండియన్ గ్రాండ్ క్యానియన్ గండికోటలో రోప్‌వే పనులకు చలనం లభించింది. 2019లో రోప్ వే పనులు ప్రారంభిస్తున్నామంటూ కొద్దిగా సామగ్రిని సిద్ధం చేసినా పనులు సాగలేదు. ఈ దశలో ఫిబ్రవరి 16న సాక్షి జిల్లా టాబ్లాయిడ్‌లో గండికొడతారా...కోట కడతారా పేరిట ఈ అంశంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో గండికోటలో అధికారుల హడావుడి మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ ఇటీవల గండికోటను సందర్శించి రోప్‌వే పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
మళ్లీ హడావుడి
దీంతోపాటు ఆయన గండికోటలో ఓబెరాయ్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ కోసం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వీలైనంత త్వర గా నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శని, ఆదివారాల్లో పర్యాటకులు గండికోటకు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో వారి వసతికి అక్కడి పర్యాటక హరిత హోటల్ సరిపోవడం లేదు. రోప్‌వే పనులు ప్రారంభమైతే పర్యాటకుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది. కేవలం ప్రారంభాలంటూ ఎప్పటిలా హడావుడి చేయడంతోనే సరిపెట్టకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానిక పర్యాటకాభిమానులు కోరుతున్నారు.
పెద్దదర్గా అభివృద్ధి ఏదీ?
ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కడపలోని పెద్దదర్గా, సోమశిలలను అభివృద్ధి చేస్తామ ని ప్రకటించారు. ఆ తర్వాత దాని అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంపై జిల్లా వాసుల్లో ముఖ్యంగా దర్గా అభిమానుల్లో ఒకింత అసంతృప్తి నెలకొంటోంది. ఎకో టూరిజానికి ఎంతో అనువుగా ఉండే సోమశిల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని పర్యాటకాభిమానులు కోరుతున్నారు.
సాక్షి కథనానికి స్పందన
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ పర్యటన
రోప్ వే పనుల కోసం అధికారులకు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment