కడప అర్బన్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన సాక్షి పులివెందులకు చెందిన రంగన్న బుధవారం సాయంత్రం 6.43 గంటలకు కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందా డ ని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మృతుడు రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామన్నారు.. గురువారం రంగన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారన్నారు. రంగన్న కేసులో ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ మృతిని అనుమానాస్పద మరణంగా భావిస్తున్నామన్నారు. రంగన్నది సామాన్య మరణమా? లేక ఏవైనా కారణాలు దాగి ఉన్నాయా అనేదానిపై దర్యాప్తు జరుపుతామన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు రంగన్నతోపాటు నలుగురు ప్రధాన సాక్షులు విడతల వారీగా మరణించారన్నారు. అందులో శ్రీనివాసరెడ్డి 2019లో, గంగాధర్‌రెడ్డి 2022లో, అభిషేక్‌రెడ్డి 2024 సెప్టెంబరులో, రంగన్న తాజాగా మార్చి 5వ తేదీన మరణించారన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షులు ఒక్కొక్కరుగా మరణించడంపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి పాత్ర, ప్రభావంపై కూడా దర్యాప్తు చేస్తామన్నారు. సాంకేతికంగా కూడా ఆధారాలు సేకరిస్తామన్నారు. ప్రతి సాక్షి మరణించిన సమయంలో పోలీసులు, సీబీఐ పాత్ర ఉందని ఎవరు ప్రచారం చేస్తున్నారో, ఆ ప్రచారం వెనుక ఎవరున్నారో కనిపెడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment