●మనోడైతే ఎలాంటి ఆరోపణలున్నా సరే..
సాక్షి ప్రతినిధి, కడప : ఆయనది మండల మేజిస్ట్రేట్ హోదా. అదే మండలంలో ఆయనపై ఐపీసీ 420, 409, 120 సెక్షన్లతో గతంలో కేసు నమోదు అయింది. ఆ కేసులో రెండవ నిందితుడు. ఈ కేసు ఏప్రిల్ 25న విచారణకు రానుంది. మండల మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న వ్యక్తి.. అదే మండలంలో నిందితుడిగా కోర్టు మెట్లు ఎక్కనున్నారు. మరోవైపు తహసీల్దార్ హోదాలో నిందుతుడిగా కోర్టులో ఉంటే, ప్రత్యక్ష సాక్షులుగా కింది స్థాయి సిబ్బంది సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. రెవెన్యూ శాఖ వింత వైఖరితో.. విజిలెన్సు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వల పన్ని పట్టుకున్న ఓ కేసు నీరుగారిపోయే అవకాశం లేకపోలేదు. వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుత మైదుకూరు తహసీల్దార్ రాజసింహ నరేంద్ర గతంలో డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ప్రభుత్వ గోడౌన్ ఇన్‌చార్జీగా ప్రొద్దుటూరులో విధులు నిర్వర్తిస్తుండే వారు. అప్పట్లో ప్రభుత్వ గోడౌన్ నుంచి 19 బస్తాల సబ్సిడీ రాగులు ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు బాక్ల్‌మార్కెట్‌కు తరలిస్తుండగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పట్టుకుంది. ఆమేరకు మైదుకూరు పోలీసుస్టేషన్‌లో క్రైమ్ నంబర్ 469/2019 అండర్ సెక్షన్ 409, 420, 120–బి రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ప్రధాన నిందితుడిగా ఆటోడ్రైవర్ నిట్టూరు పెద్ద మస్తాన్ కాగా, ఏ–2గా వేల్పుల రాజసింహ నరేంద్ర (ప్రస్తుత మైదుకూరు తహసీల్దార్), ఏ–3గా లక్ష్మిపేట ఎఫ్‌పీ షాపు డీలర్ సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. ఏ–4, ఏ–5లుగా మైదుకూరుకు చెందిన వ్యాపారులు లక్ష్మినారాయణ, రామకృష్ణపై పోలీసులు కోర్టుకు చార్జీషీట్ దాఖలు చేశారు. కాగా ఈ కేసుపై ఏప్రిల్ 25న మైదుకూరు కోర్టులో వాయిదా ఉంది. నిందితులు అంతా హాజరైతే కేసు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
పై అధికారిపై సాక్ష్యం సాధ్యమేనా..
బాస్‌పై కింది స్థాయి సిబ్బంది సాక్ష్యం చెప్పడం సాధ్యమేనా... అంటే ఉన్నది ఉన్నట్లు సాక్ష్యం చెప్పడం అసాధ్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైదుకూరు మండల మేజిస్ట్రేట్ హోదాలో ఉన్నారు. సాక్ష్యం చెప్పాల్సిన వారిలో తన కింద పని చేస్తున్న వీఆర్‌ఏ ప్రసాద్‌కుమార్ ఉన్నారు. దువ్వూరు మండలంలో ఎంఆర్‌ఐగా పని చేస్తున్న ఆవుల జాన్‌సన్, వీఆర్వోగా పని చేస్తున్న షేక్ ఫజల్ ఆలీ ప్రత్యక్ష సాక్షులు. అప్పట్లో మైదుకూరులో పని చేస్తున్న ఆ ఇరువురు బదిలీపై దువ్వూరు మండలంలో విధులు కొనసాగిస్తున్నారు. వీరంతా స్థానికంగా ఉన్న తహసీల్దార్‌పై సాక్ష్యం సవ్యంగా చెప్పగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదే విషయమై విజిలెన్సు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సైతం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అక్రమార్కులను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తే.. ఆయా ప్రభుత్వ శాఖల సహకారం లేకపోతే కేసులు నీరుగారే అవకాశం ఉందని సీనియర్ అధికారులు వాపోతున్నారు. కంచె చేను మేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని.. అదే మండలంలో రెవెన్యూ బాస్‌గా నియమించడం ఏమిటని పలువురు నిలదీస్తున్నారు. 420, 409, 120 ఐపీసీ సెక్షన్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజసింహనరేంద్ర అదే మండలానికి తహసీల్దార్‌గా నియామకం వెనుక ప్రధానంగా ఈ కేసు నుంచి గట్టేక్కాలనే దృఢ సంకల్పం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు రెవెన్యూ శాఖ సైతం సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు సమాచారం.
మైదుకూరు తహసీల్దార్
రాజసింహనరేంద్రపై 420 కేసు
ఏప్రిల్ 25న విచారణకు రానున్న వైనం
ఆర్‌ఐ, వీఆర్వో, వీఆర్‌ఏ ప్రత్యక్ష సాక్షులు
కింది స్థాయి సిబ్బంది వ్యతిరేకంగా సాక్షం చెప్పడం సాధ్యమా?
రెవెన్యూ శాఖలో వింత వైఖరిపై
విస్తుపోతున్న జనం
సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్సార్‌సీపీ పక్షం వారికి పనులు చేయరాదంటూ బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరుణంలో ఎలాంటి ఆరోపణలున్నా సరే.. అధికార పార్టీ నేతల సహకారం ఉంటే అధికారులకు పోస్టింగ్ ఇస్తున్నారు. అందులో భాగంగానే మైదుకూరు తహసీల్దార్ రాజసింహ నరేంద్రకు సైతం మైదుకూరులో పోస్టింగ్ దక్కిందని పలువురు వెల్లడిస్తున్నారు. కలెక్టర్ నిష్పక్షపాతంగా అధికారం ప్రయోగిస్తే కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తికి.. అదే ప్రాంతానికి మండల మేజిస్ట్రేట్ హోదాలో కూర్చోబెట్టే అవకాశం లేదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకూ మైదుకూరు తహసీల్దార్ రాజసింహనరేంద్రను అక్కడి నుంచి తప్పించాలని పలువురు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
●మనోడైతే ఎలాంటి ఆరోపణలున్నా సరే..
●మనోడైతే ఎలాంటి ఆరోపణలున్నా సరే..
Comments
Please login to add a commentAdd a comment