గంజాయి రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
ప్రొద్దుటూరు క్రైం : గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సెల్, ప్రొద్దుటూరు పోలీసు అధికారులు హెచ్చరించారు. పట్టణంలోని ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, గోడౌన్‌లలో శుక్రవారం డీఎన్‌సీసీ, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో గంజాయిని పూర్తిగా కట్టడి చేసే క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి రవాణా జరగకుండా జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారని డీఎన్‌సీసీ సీఐ రమణారెడ్డి, టూ టౌన్ సీఐ యుగంధర్‌లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, గోడౌన్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. వస్తు రవాణా వాహనాల్లో గంజాయి రవాణా జరిగితే ట్రాన్స్‌పోర్టు యాజమాన్యాలను కూడా బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.
అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
కాశినాయన : మండలంలోని కోడిగుడ్లపాడు మెయిన్ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త టి.గురుదేవి శుక్రవారం వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పండింది. వెంటనే వారి బంధువులు గమనించి పోరుమామిళ్ళ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే కోడిగుడ్లపాడు అంగన్వాడీ కేంద్రానికి నాడు–నేడు పనుల కింద రూ.14 లక్షలు నిధులు మంజూరయ్యాయి. కార్యకర్తే భవనాన్ని నిర్మించుకున్నారు. అయితే పోరుమామిళ్ల ఐసీడీఎస్ ఇన్‌చార్జి సీడీపీఓ లక్ష్మిదేవి రూ.22 వేలు డబ్బులివ్వాలని వేధించడం వలన కార్యకర్త గురుదేవి ఒకసారి రూ.10 వేలు, ఒకసారి రూ.12 వేలు ఇచ్చినట్లు గురుదేవి తెలిపారు. అంగన్వాడీ కేంద్రం కోడ్ మార్చేందుకు రూ.20 వేలు సీడీపీఓ అడిగిందని వాపోయింది. వేధింపులు తాళలేక వాస్మోల్ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బంధువులు తెలిపారు. ఈ విషయమై ఇన్‌చార్జి సీడీపీఓ లక్ష్మిదేవిని వివరణ కోరగా నాడు–నేడు పనులకు మాకు ఎటువంటి సంబంధం లేదని, అది ఇంజినీర్లు చూసుకుంటారని, నేను ఆమె వద్ద డబ్బులు తీసుకోలేదని తెలిపారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ ఎండీకి వినతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్రంలో ఆర్టీసీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 8 వేల ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్యాలరావు, కుమారనాయక్ కోరారు. శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావును కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీలో కాంట్రాక్టు వ్యవస్థల వల్ల రోజురోజుకు కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంట్రాక్టర్ మారే ప్రతిసారి కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కొత్త వారిని తీసుకుంటామని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు.
నేడే జాతీయ లోక్ అదాలత్
కడప అర్బన్: జిల్లా న్యాయసేవాధికారసంస్థ, కడప వారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈనెల 8న ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాతీయలోక్ అదాలత్ నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 16 బెంచీలను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment