జ్యోతి క్షేత్రంపై కూటమి ప్రభుత్వం కక్ష
పోరుమామిళ్ల : జ్యోతి క్షేత్రంపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఉంది. లక్షలాదిమంది భక్తులకు ఆరాధనీయుడైన కాశినాయన జ్యోతిక్షేత్రంలో నిర్మాణాలు కూల్చి వేయడం సరికాదని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జ్యోతిక్షేత్రంలో మూడు కట్టడాలు కూలగొట్టడంపై ఎమ్మెల్సీ స్పందించారు. సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కాశినాయన భక్తులు ఉన్నారని, ఆయన పేరుతో ఎన్నో ఆశ్రమాలు, ఆలయాలు వెలశాయన్నారు. జ్యోతిక్షేత్రంలో సంవత్సరానికి ఒకసారి జరిగే ఆరాధనకు లక్షల మంది భక్తులు వస్తున్నారన్నారు. గత మూడు దశాబ్దాలుగా ప్రతిరోజూ ఇక్కడికి భక్తులు వస్తున్నారని, నిత్య అన్నదానం సజావుగా కొనసాగుతోందన్నారు. ఫారెస్టు అధికారులు అక్కడ కట్టడాలు కూలగొట్టడం అన్యాయమన్నారు. రెండు నెలలకిందటే అటవీశాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, అయినా ఇపుడు దుర్మార్గంగా కూలగొట్టడం కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అడవుల్లోనే దేవస్థానాలు ఉన్నాయని, తిరుపతి, శ్రీశైలం తదితర వేలాది దేవస్థానాలు అడవుల్లో ఉన్నాయని, ఇక్కడ జ్యోతి నరసింహస్వామి దేవస్థానం ఎన్నో శతాబ్దాలుగా ఉందన్నారు. అక్కడే కాశినాయన దేహపరిత్యాగం చేయడంవల్ల ఆయన ఆలయం నిర్మించారన్నారు. ఎంతో ప్రసిద్ధి పొందిన కాశినాయన ఆశ్రమం కూలగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నం మంచిది కాదన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం విరమించుకొని ప్రభుత్వం భక్తులు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఎంపీ నిధులతో, ప్రభుత్వ నిధులతో అక్కడ అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదన్నారు. ప్రభుత్వం, అటవీశాఖ మంత్రి స్పందించి భక్తుల ఆశలను కాపాడాలన్నారు.
భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
నిర్మాణాలు కూలగొట్టడం సరికాదు
ఎమ్మెల్సీ గోవిందరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment