అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
– జేసీ అదితిసింగ్
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. కింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారినే వెళ్లాలన్నారు. తొలుత జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పీజీఆర్‌ఎస్ దరఖాస్తులపై ఆయా జిల్లా అధికారులతో సమీక్షించారు.
● తనకు ఎన్టీఆర్ వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ఖాజీపేట నందిపాడుకు చెందిన లింగారెడ్డి రవణమ్మ కోరారు.
● తన భర్త ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ 1999లో మరణించారని, కారుణ్య నియామకం కింద పిల్లలకు ఉద్యోగం మంజూరు చేయాలని చింతకొమ్మదిన్నె మండలం అంగడి వీధికి చెందిన వీఆర్ శుభాషణమ్మ విన్నవించారు.
● కాశినాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన పి.నాగమ్మ సర్వే నెం.140లో 0.40 సెంట్లు స్థలం కలదని, అందులో తన ఇంటి స్థలానికి సర్వే చేయించి హద్దులు చూపే వరకు పక్కవారు నిర్మా ణం నిలుపుదల చేయించాలని అభ్యర్థించారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, డీఆర్డీఏ, మెప్మా పీడీలు ఆనంద్ నాయక్, కిరణ్ కుమార్, ఎస్డీసీ వెంకటపతి, శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment