
తెలుగు సంస్కృతి అకాడమి ఏర్పాటు చేయాలి
కడప కల్చరల్ : కడప నగరంలో తొలి తెలుగు రామాయణ రచయిత్రి మొల్లమాంబ పేరిట తెలుగు సంస్కృతి అకాడమిని ఏర్పాటు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా వికాస ఉద్యమం, మొల్ల సాహితీ పీఠం అధ్యక్ష కార్యదర్శులు విద్వాన్ గానుగపెంట హనుమంతరావు, మనోజ్ కుమార్‌ల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో సాహితీ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వేశ్వరనాయుడు మాట్లాడుతూ మొల్లమాంబ మన ఆడబిడ్డ కావడం తెలుగుజాతి చేసుకున్న అదృష్టమన్నారు. వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ మాట్లాడుతూ మొల్లమాంబ స్ఫూర్తితో మహిళలు తమలోని ప్రతిభను చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, జింకా సుబ్రమణ్యం, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.రామ్మూర్తి నాయుడు, ఉపాధ్యక్షుడు తుపాకుల నారాయణ, కోశాధికారి నూనె నాగేష్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పార్వతి, అపూర్వ సుందరి, కమాల్ బీలకు మహిళా సేవారత్న పురస్కారాలను అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, సాహిత్య పీఠం ఉపాధ్యక్షుడు పెండ్లిమర్రి మల్లయ్య, పార్వతమ్మ, పెన్షనర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగముని రెడ్డి, మహిళా కార్యదర్శి కొండూరు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment