36వ రోజుకు చేరిన సమ్మె
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ సమీపంలోని పశువైద్య కళాశాల విద్యార్థులు తమకు స్టైఫండ్ పెంచాలని చేస్తున్న సమ్మె సోమవారం 36వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పశువైద్య విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచే వరకు సమ్మెను విరమించమని తేల్చి చెప్పారు.
పరీక్షా ఫలితాలు విడుదల
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం ఎమ్మెస్సీ మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను సోమవారం వైవీయూలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్.రఘునాథరెడ్డి, కులసచివులు ఆచార్య పి.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య కెఎస్వీ కృష్ణారావు, డీన్ ఆచార్య ఎ.జి.దాముతో కలసి విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ ఆచార్య రఘునాథ రెడ్డి మాట్లాడుతూ బోటని, బయోకెమిస్ట్రీ, జియాలజి, మైక్రోబయాలజి, ఫిజిక్స్ ఎన్విరాన్మెంటల్ సైన్సు, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్ కాంపుటేషనల్ డేటా సైన్స్ కోర్సులలో వందశాతం ఉత్తీర్ణత లభించిందన్నారు. మ్యాథమ్యాటిక్స్ 75శాతం, పుడ్ టెక్నాలజి 95 శాతం, జువాలజి 96.43 శాతం, కంప్యూటర్ సైన్స్ 68 శాతం, బయోటెక్నాలజి 97.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వారు అభినందించారు. విద్యార్థులు ఫలితాల కోసం https:www.yvuexam s.in/results.aspx వెబ్‌సైట్‌ను సందర్శించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు విద్యార్థులకు సూచించారు.
ప్రశాంతంగా
ఇంటర్ పరీక్ష
కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–2బి, జువాలజీ, హిస్టరీ పరీక్ష జరిగింది. జిల్లావ్యాప్తంగా 12,751 మంది విద్యార్థులకు 12,348 మంది విద్యార్థులు హాజరుకాగా 403 మంది గైర్హాజరయినట్లు ఆర్‌ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇందులో జనరల్‌కు సంబంధించి 11,662 మంది విద్యార్థులకు 11,317 మంది హాజరుకాగా 345 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్‌కు సంబంధించి 1089 మంది విద్యార్థులకు 1031 మంది హాజరుకాగా 58 మంది గైర్హాజయ్యారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment