ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. మ్యాథ్స్–2ఎ, బాటనీ, సివిక్స్ పరీక్షలకు సంబంధించి 600 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్‌ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. జిల్లావ్యాప్తంగా 64 పరీక్షా కేంద్రాల్లో జనరల్, ఒకేషన్‌కు 15061 మందికి 14461 మంది హాజరయ్యారని చెప్పారు.
టెన్త్ పరీక్షలకు ఉచిత ప్రయాణం
కడప కోటిరెడ్డిసర్కిల్: ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుందని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ ఆధారంగా ఏ విధమైన బస్సు పాస్ లేకపోయినా కూడా పల్లె వెలుగు/ అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణించవచ్చన్నారు. పరీక్షలున్న రోజుల్లో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
నిధుల అవకతవకలు:
ఇద్దరిపై చర్యలు
కడప సెవెన్‌రోడ్స్: గ్రామ పంచాయతీ నిధుల్లో అవకతవకలకు పాల్పడిన ఇద్దరిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రాజుపాలెం మండలం ఏరువపాలెం గ్రామ పంచాయతీ గ్రేడ్–3 సెక్రటరీగా పనిచేసి ప్రస్తుతం జిల్లా పరిషత్ రీసోర్స్ పర్సన్‌గా విధులు నిర్వర్తిస్తున్న బి.పుల్లారెడ్డి రూ. 4,25,986లను వ్యక్తిగతంగా డ్రా చేసుకుని స్వంత అకౌంట్‌లో జమ చేసుకున్నారని ఆరోపణలు రుజువు కావడంతో ఆయనను సస్పెండ్ చేశారు. అలాగే చాపాడు మండలం బద్రిపల్లె గ్రామ పంచాయతీకి చెందిన రూ. 2,56,325 దుర్వినియోగం చేసిన ఆరోపణలు రుజువు కావడంతో మండల స్థాయి కంప్యూటర్ ఆపరేటర్ షేక్ హనీఫ్‌బాషాను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
9న రాయలసీమ సమగ్ర అభివృద్ధిపై చర్చా వేదిక
ప్రొద్దుటూరు: పట్టణంలో ఈనెల 9న రాయలసీమ సమగ్ర అభివృద్ధిపై ఉమ్మడి కడప జిల్లా స్థాయి చర్చావేదిక నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేదిక రాష్ట్ర కన్వీనర్ నాగరాజు తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరు ఉపవిద్యాశాఖ కార్యాలయం వద్ద చర్చావేదిక కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమ ప్రాంత ప్రజలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తెలిపారు. కరువు ప్రాంతమైన రాయలసీమలో యువత ఉపాధి లేక వలస పోతున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు. ఈ చర్చా వేదికలో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సేవా సంఘం నాయకుడు ఏవీ రమణ, వీరనారాయణరెడ్డి, ఎర్ర వెంకటేష్, నాగిశెట్టి ప్రసాద్, మాధవరెడ్డి, భీమరాజు పాల్గొన్నారు.
జాతీయ రహదారి భూసేకరణ పనులు పూర్తి చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్‌లో జాతీయ రహదారి భూసేకరణ పురోగతి పనులపై రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులతో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి భూసేకరణకు సంబంధించి జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. టైటిల్ వివాదాలు,రెవిన్యూ భూ వివాదాలకు సంబంధించి ఓపెన్ ఫోరం ఏర్పాటు చేసి గ్రామాల వారీగా ప్రజలతో మాట్లాడి భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. తొలుత జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ జాతీయ రహదారి భూసేకరణ పనుల పురోగతి పై ఆయా పనుల వారిగా అధికారులతో సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment