భూమి ఒకరిది.. కట్టబెట్టింది మరొకరికి..
సాక్షి ప్రతినిధి, కడప : రైలు బండిని నడిపేదీ పచ్చా జెండాలే.. బతుకు బండిని నడిపేది పచ్చనోటే లే.. అన్నాడు ఓ సినీ గేయ రచయిత. ఆ గీతాన్ని ఆదర్శంగా తీసుకున్న కొంత మంది అధికారులు జీతం కంటే, గీతమే ముఖ్యమని మురిసిపోతున్నారు. ఈ తంతు రెవెన్యూశాఖలో మరింత అధికంగా ఉంది. డబ్బుంటే కానిదీ లేదని కొందరు అధికారులు రుజువు చేస్తున్నారు. హక్కులను సైతం కాలరాస్తున్నారు. డబ్బులిస్తే హక్కుదారులను కాదని, అదే భూమి వైరిపక్షానికి చెందినదిగా ధ్రువీకరణ చేస్తున్నారు. ఇలాంటి ఉదంతం తాజాగా ఖాజీపేట మండలంలో వెలుగు చూసింది. 60 ఏళ్ల నుంచి ఉన్న హక్కుల ఆధారంగా ఆన్‌లైన్ చేయాలని అభ్యర్థిస్తే తహసీల్దార్ చేయకపోగా, మిగులు భూమిగా ఆన్‌లైన్‌లో చూపుతున్న ఆ భూమి ఇళ్ల స్థలాలకు చెందినదంటూ ధ్రువీకరించారు. ధ్రువీకరణ ఆధారంగా ఘనత వహించిన రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏకంగా ఏడుగురి పేరుతో 9.5 సెంట్ల చొప్పున రిజిస్ట్రేషన్ సైతం చేయించారు.
పక్కా రికార్డులున్నా..
ఖాజీపేట మండలం చెముళ్లపల్లె పొలంలో సర్వే నంబర్ 393/1, 393/3, 394/1ఏ పరిధిలో 2 ఎకరాల పొలాన్ని కల్లూరు తిరుపతిరెడ్డి, పిచ్చిరెడ్డి అనే సోదరుల నుంచి ములపాకు లక్ష్ముమ్మ కొనుగోలు చేసింది. ఆ మేరకు డాక్యుమెంట్ నంబర్ 4239/ 1965 ద్వారా 1965 ఫిబ్రవరి 5లో రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి ఆ భూమి ములపాకు లక్ష్ముమ్మ ఆధీనంలోనే ఉంది. 1994 ఫిబ్రవరి 10న మనువరాలైన ములపాకు సుశీలమ్మకు రిజిస్టర్డ్ వీలునామా రాయించింది. నేషనల్ హైవే రహదారి విస్తరణకు పోనూ 1.18 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఆ భూమిపై తనకు హక్కులున్నాయంటూ అదే గ్రామానికి చెందిన పత్తి బయపురెడ్డి 2010లో మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. 2019లో కోర్టు సుశీలమ్మకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తీర్పుపై బయపురెడ్డి జిల్లా కోర్టుకు అప్పీలుకు వెళ్లారు. జిల్లా కోర్టు సైతం ఏఎస్ 9/2019 డీఫాల్ట్ 2025 ఫిబ్రవరిలో కొట్టి వేసింది. ఇవన్నీ పక్కా రికార్డులున్నా, సుశీలమ్మ తరుఫు హక్కుదారులకు ఆన్‌లైన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు సమ్మతించలేదు.
సిబ్బందిని సెలవులో పంపి సర్టిఫికెట్ జారీ
వీలునామా రిజిస్ట్రేషన్ కల్గి ఉన్న సుశీలమ్మ నుంచి కొత్తపేటకు చెందిన గోపాల్‌రెడ్డి ఆ భూమి కొనుగోలు చేశారు. ఆమేరకు డాక్యుమెంటు నంబర్ 5779/2022 ద్వారా రిజిస్ట్రేషన్ అయింది. కాగా జిల్లా కోర్టులో బయపురెడ్డి అప్పీల్ కొట్టి వేసిన తర్వాత ఫిబ్రవరి 18న అన్నీ ఆధారాలు అందజేసి గోపాల్‌రెడ్డి ఆన్‌లైన్ చేయాల్సిందిగా తహసీల్దార్‌ను అభ్యర్థించారు. పక్షం రోజుల తర్వాత మార్చి 4న రిజిస్ట్రేషన్ ద్వారా సంక్రమించి, స్వాధీన అనుభవంలో ఉన్న భూమి డాక్యుమెంట్లు హక్కుపత్రాలు అందించి మ్యూటేషన్ చేయాల్సిందిగా కోరారు. తహసీల్దార్ వారి అభ్యర్థన పెడచెవిన పెట్టడమే కాకుండా, అదే రోజు ఆ భూమిని బయపురెడ్డి హక్కుదారుడిగా సర్టిఫికెట్ జారీ చేశారు. మామిడి చెట్లు, పశువుల షెడ్డు ఉన్న ఆ స్థలం బయపురెడ్డికి చెందిన ఇళ్ల స్థలాలుగా ధ్రువీకరించారు. స్థానికంగా వీఆర్వో, సర్వేయర్ సంతకాలతో నిమిత్తం లేకుండా ఆర్‌ఐ, డీటీలతో బలవంతంగా సంతకాలు చేయించినట్లు సమాచారం.
వంతపాడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
డబ్బులిస్తే ‘నందిని పంది, పందిని నంది’ చేయగల సమర్థత కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాయానికి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. చెముళ్లపల్లె వ్యవహారంలో కూడా ఆ విషయం తేటతెల్లమైంది. సర్వే నంబర్ 394/1ఏలో మిగులు భూమిగా ఆన్‌లైన్‌లో చూపుతోంది. అయినా రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మార్చి 5న ఏడుగురి పేర్లుతో రిజిస్ట్రేషన్ చేసింది. ఒక్కొక్కరికి 9.5 సెంట్ల చొప్పున డాక్యుమెంట్ల నంబర్లు 1813/2025, 1814, 1817, 1819, 1820, 1821, 1822/2025తో రిజిస్ట్రేషన్లు చేసింది. సామాన్యులు రిజిస్ట్రేషన్‌కు వెళితే ఆన్‌లైన్ లేదని యక్షప్రశ్నలతో ముప్పు తిప్పలు పెట్టే యంత్రాంగం.. ముందు రోజు తహసీల్దార్‌తో సర్టిఫికెట్ పొందడం, వెంటనే రికార్డులు పరిశీలించకుండా రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు బాధితుడు గోపాల్‌రెడ్డి వాపోతున్నారు. అటు రెవెన్యూ, ఇటు రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారని తెలిపారు. మామిడి చెట్లు, షెడ్డు ఉన్న పొలాన్ని ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేయడం వెనుక ఒక్క రోజులోనే లక్షలు చేతులు మారడంతోనే ఇలా చేశారని ఆరోపిస్తుండడం గమనారహం.
రెవెన్యూ శాఖలో అడ్డగోలు ఆర్డర్లు
ఖాజీపేట మండలంలో హక్కుదారులను విస్మరిస్తున్న తహసీల్దార్
కోర్టు ఉత్తర్వులను పెడచెవిన పెట్టిన అధికారి
హక్కులున్నా ఆన్‌లైన్ చేయని వైనం
ప్రత్యర్థులకు అదే భూమికి సర్టిఫికెట్ జారీ
భూమి ఒకరిది.. కట్టబెట్టింది మరొకరికి..
Comments
Please login to add a commentAdd a comment