
అల్లాహ్ ప్రార్థనకు పిలుపు.. అజాన్
కడప కల్చరల్ : తెల్లవారుజాము సమయం. చిరు చీకట్లను తరిమివేస్తూ వెలుగు రేఖలు విచ్చుకుంటున్న వేళ. ఆ ప్రశాంత సమయంలో ‘అల్లాహు అక్బర్’ అంటూ గంభీరమైన స్వరం. అల్లాహ్‌ను ప్రార్థించేందుకు రమ్మంటూ ఇస్తున్న పిలుపు హృదయాన్ని తాకుతున్న ఆ ఆహ్వానాన్ని అందుకుని మనసారా దైవ ప్రార్థనలు చేసేందుకు సిద్ధమవుతున్న ముస్లింలు. మసీదులలో దైవ ప్రార్థనలకు రావాలంటూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఐదుమార్లు ఇలా అజాన్ పిలుపు వినిపించడం అందరికీ తెలిసిందే. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ప్రతిరోజు ఐదుసార్లు నమాజ్‌ను అధిక సంఖ్యలో మసీదులకు తరలివచ్చి ఆచరిస్తారు. ఇందులో భాగంగా ఆజాన్ గురించి కడప నగరానికి చెందిన ధర్మ పరిచయ కమిటీ ప్రతినిధి హజరత్ సయ్యద్ అహ్మద్ (బాబుభాయ్) ఇలా వివరిస్తున్నారు.
ప్రపచంలోని ముస్లింలందరికీ ఈ పవిత్ర రంజాన్ మాసం ప్రాణప్రదమైనదిగా భావిస్తారు. ఈ జన్మకు ముక్తిని ప్రసాదించే దివ్య వరంగా భావించి ఈ సందర్భంగా దైవం సూచించిన మార్గాలలో తప్పక అనుసరిస్తారు. సాధారణ రోజుల్లో ఆచరించే ప్రార్థనలతోపాటు ప్రతిరోజు తరావీ ప్రార్థనలు చేయడం ఈ మాసం ప్రత్యేకతగా చెప్పవచ్చు. కేవలం రంజాన్ మాసంలోనే గాక మిగతా రోజుల్లో కూడా ముస్లింలు రోజూ ఐదు మార్లు ప్రార్థనలు చేస్తారు. రోజువారి పనుల్లో నిమగ్నమైన వారికి ప్రార్థనా సమయం ఆసన్నమైందని తెలుపుతూ మసీదుల్లోని మౌజన్లు ‘అల్లాహు అక్బర్’ అంటూ పిలుపునిస్తారు. అజాన్ విన్న వెంటనే వీలైనంత త్వరగా మసీదులకు చేరుకుని ప్రార్థనలు చేస్తారు. ఆజాన్‌లో వచ్చే వాక్యాలు అరబ్బీ భాషలో ఉన్నాయి. ఐదు పూటల నమాజుకు ముందు సమీపంలోని ముస్లింలందరికీ ప్రార్థనలకు వేళ అయిందని సూచిస్తూ ఇచ్చే ఈ పిలుపు ముస్లింల రోజువారి జీవితంలో ఒక భాగమైంది. ఈ పిలుపు వినగానే అసంకల్పితంగా ముస్లింలు మసీదు వైపు వెళతారు. అజాన్ అర్థం తెలిసిన వారు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
అజాన్ వెనుక కథ
ఏకేశ్వరుడైన అల్లాహ్‌ను సామూహికంగా ఆరాధించేందుకు ప్రజలందరికీ ఎలా సమీకరించాలన్న విషయంపై ప్రవక్త తన అనుచరులతో సంప్రదింపులు జరిపారు. ‘బూర’ ఊది గుర్తించాలని కొందరు, డోలు మోగిస్తే బాగుంటుందని మరికొందరు, జెండా ఊపితే మంచిదని మరికొందరు ఇలా రకరకాల సలహాలు ఇచ్చారు. ఈ విషయంగా అబ్దుల్లా బిన్ జైద్ ర.జి. దీర్ఘంగా ఆలోచించడం ప్రారంభించారు. ఒక రాత్రి కలలో ఇప్పుడు మనం వింటున్న అజాన్ పిలుపులోని మాటలను ఆయన అనుభూతించారు. ఈ విషయాన్ని మహా ప్రవక్తకు తెలిపారు. హజరత్ ఉమర్ ర.జి.లు కూడా ఇదే కలగన్నారు. విషయం తెలుసుకున్న ప్రవక్త మహనీయుడైన ఉమర్‌ను పిలిచి వచ్చిన కల గురించి అడిగారు. తనకంటే ముందు అబ్దుల్లా బిన్ జైద్ ఈ కలగన్నారని, కనుక ఆయన ద్వారానే వివరాలు వినడం మంచిదని భావిస్తున్నామని ఉమర్ తెలిపారు. ప్రవక్త తన ప్రియ సహచరుడు హజరత్ బిలాల్ ర.జి.ని పిలిచి అబ్దుల్ బిన్ జైద్ ఏ వాక్యాలు పలుకుతారో వాటిని మీరు గొంతెత్తి గట్టిగా పలకాలని ఆదేశించారు. ఆ వాక్యాలకు అజాన్ అనే పేరు ఖరారైంది.
మసీదుల్లో అజాన్ పిలుపునిచ్చే వ్యక్తిని మౌజన్ అంటారు. ఈ పిలుపు ద్వారా ‘ఓ మానవులారా అల్లాహ్ సర్వోన్నతుడు.. గుణ విశేషణాలలో అద్వితీయుడు.. స్వయం ప్రభువు, ఆది మధ్యాంత రహితుడు, అనంతుడు, పోలిక లేనివాడు, నిర్వికారుడు, సమస్త సృష్టికి నిర్దేశకుడు, సర్వశక్తివంతుడు, అంతర్యామి, సృష్టికర్త’ అని వివరిస్తాడు.
రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో కథనం
అజాన్.. దాని అర్థం ఇలా ఉంది
అల్లాహు అక్బర్...అల్లాహు అక్బర్...
అల్లాహు అక్బర్....అల్లాహు అక్బర్...
(అల్లాహ్ సర్వోన్నతుడు)
అష్‌హదు అన్ లాయిలాహ ఇల్లల్లాహ్
అష్‌హదు అన్ లాయిలాహ ఇల్లల్లాహ్
(అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు
అర్హులు కాదని నేను సాక్ష్యం ఇస్తున్నాను)
అష్‌హదు అన్న మహమ్మదర్రసూలుల్లాహ్
అష్‌హదు అన్న మహమ్మదర్రసూలుల్లాహ్
(మహమ్మద్(సొ.అ.వ) అల్లాహ్ సందేశ
హరులు అని నేను సాక్ష్యం పలుకుతున్నాను)
హయ్య అలస్సలాహ్....హయ్య అలస్సలాహ్
(రండి నమాజ్ వైపునకు రండి)
హయ్య అలల్‌ఫలాహ్...హయ్య అలల్‌ఫలాహ్
(రండి సాఫల్యం వైపునకు)
అస్సలాతు ఖైరుమ్ మిన్నన్నౌమ్
అస్సలాతు ఖైరుమ్ మిన్నన్నౌమ్
(నిద్రకన్నా నమాజ్ ఉత్తమమైనది)
అల్లాహు అక్బర్....అల్లాహు అక్బర్
(అల్లాహ్ సర్వోన్నతుడు)
లా ఇలాహ ఇల్లల్లాహ్
(అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్యులు లేరు)
‘అస్సలాతు ఖైరుమ్ మిన్నన్నౌమ్’– ఈ వాక్యాలను తెల్లవారుజామున ఇచ్చే అజాన్‌లో మాత్రమే పలుకుతారు.
Comments
Please login to add a commentAdd a comment