
కాలుష్యం నుంచి కాపాడండి
జమ్మలమడుగు : దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని అయితే అందులో నుంచి వస్తున్న బూడద వల్ల తమ పంట పొలాలకు తీవ్ర నష్టం కలుగుతోందని మైలవరం మండలం దుగ్గనపల్లి గ్రామానికి చెందిన రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం వారు ఆర్డీఓ సాయిశ్రీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ దాల్మియా ఫ్యాక్టరీని వంకకు అడ్డంగా నిర్మించారన్నారు. ప్రహరీ నిర్మాణం వల్ల ఆలుగోకు వంక ఏటా వచ్చి తమ పంటలను నాశనం చేయడంతోపాటు రోజుల తరబడి నీరు పొలాల్లో నిల్వ ఉంటోందన్నారు. ఈ కారణంగా వేసిన పంటలు కుళ్లిపోయి తీవ్ర నష్టం వస్తోందని వారు వాపోయారు. విస్తరణ పనుల కోసం ఈనెల 27వతేదీన చేపట్టనున్న ప్రజాభిప్రాయ సేకరణను వెంటనే అధికారులు నిలుపుదల చేయాలని కోరారు.
క్రిమినల్ కేసులు పెట్టాలి
సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా చీపాటి మోషే అనే రైతు సాగు చేసిన మిర్చి పంట నాణ్యత లేకుండా పోయిందన్నారు. ఈ పంటను గుంటూరు మార్కెట్ యార్డులో విక్రయించేందుకు వెళితే అక్కడి వ్యాపారులు నాణ్యత లేని కారణంగా తక్కువ ధరకు అమ్మాలని కోరడంతో మిర్చిని మార్కెట్ యార్డులోనే వదిలేసి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. పంట నష్టపోవడానికి, రైతు ఆత్మహత్యకు కారణమైన దాల్మియా యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రైతులు డీఎస్పీ వెంకటేశ్వర్లుకు విజ్ఞప్తి చేశారు.
సమస్యలపై ఆర్డీఓ ఆరా
మైలవరం : మండల పరిధిలోని నవాబుపేట గ్రామంలో గత కొద్దిరోజులుగా దాల్మియా సిమెంటు ఫ్యాక్టరీ వల ఎదురవుతున్న సమస్యలపై ఆర్టీఓ సాయిశ్రీ ఆరా తీశారు. సోమవారం ఆమె గ్రామంలో పర్యటించారు. దాల్మియా కంపెనీ బ్లాస్టింగ్ చేయడం వల్ల గ్రామంలోని ఇళ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని, వంకకు అడ్డంగా గోడ కట్టడం వల్ల పొలంలో నీరు నిల్వ ఉండి పంట పొలాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆమె దృష్టికి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment