
ఆర్టీసీ బస్సులో 7 తులాల బంగారు నగలు చోరీ
ముద్దనూరు : ముద్దనూరు నుంచి పులివెందులకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు చెందిన సుమారు 7 తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. బాధితురాలి కథనం మేరకు.. జమ్మలమడుగు నుంచి సౌజన్య అనే మహిళ ఈనెల 8వతేదీన శనివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పులివెందుల వెళ్లేందుకు ముద్దనూరులో బస్సు ఎక్కింది. ఆమె భర్త సౌజన్యను బస్సులోకి ఎక్కించి బ్యాగును అందజేసి వెళ్లిపోయాడు. గంట తర్వాత ఆమె పులివెందులలో దిగి బ్యాగు తీసుకుని చూసుకుంది. ఆమె బ్యాగు లోపల చిన్న కవర్లలో పెట్టి ఉన్న 3 రకాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించింది. ముద్దనూరు నుంచి పులివెందుల ప్రయాణ సమయంలో ఆమె బ్యాగులో దాచిన బంగారు నగలను ఎవరో దొంగిలించారని, బంగారు నగలు దాచిన బ్యాగును తన సీటు కిందనే ఉంచుకున్నట్లు బాధితురాలు తెలిపారు.
ఫిర్యాదులపై సత్వరం
స్పందించి న్యాయం చేయాలి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి, వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమాకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment