ప్రజల గుండెల్లో వైఎస్సార్‌సీపీ జెండా!
విలువలు, విశ్వసనీయతే ఆ పార్టీ మూల
స్తంభాలు... సంక్షేమం.. అభివృద్ధి ఆ పార్టీ
సిద్ధాంతాలు.. ప్రజా పక్షమై పోరాటాలు చేయాలన్నా.... ప్రజా సంక్షేమానికి పట్టం కట్టాలన్నా ఆ పార్టీతోనే సాధ్యం. ఆంక్షల కంచెల్ని చీల్చుకుంటూ.. ప్రజా ఆకాంక్షల మేరకు ఆవిర్భవించిందా పార్టీ. అదే వైఎస్సార్ సీపీ. ఈ పేరే ఒక సంచలనం..
పార్టీ ఆవిర్భావమే ఓ సంచలనం..
కష్టాలను తట్టుకుంటూ.... కన్నీళ్లను దిగమింగుకుంటూ ఉదయించిన ప్రజా నాయకుడతడు.. కేంద్రంలోని పెద్దల వంచనను నిలదీస్తూ.. పార్టీలన్నీ ఒక్కటై పన్నిన కుట్రలను పటాపంచలు చేస్తూ... ఎదిరించి గెలిచిన విజేతతడు. అతడే.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్‌జగన్ మోహన్ రెడ్డి. సరిగ్గా 14 ఏళ్ల క్రితం వైఎస్సార్ ఘాట్ వద్ద రెపరెపలాడుకుంటూ నింగికెగిరిన పార్టీ జెండా.. నేడు ప్రజల గుండెల్లో నిలిచి పోయింది.
సాక్షి కడప: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా... కుటిల రాజకీయాలను తరిమికొట్టడమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించింది. ‘పార్టీ అంటే సామాన్య విషయం కాదు...ఎన్ని రోజులు నడుపుతారో చూస్తా’మంటూ ప్రగల్భాలు పలికిన నేతలు కాలగర్భంలో కలిసిపోగా ప్రజల పక్షాన నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని విజయాలు సాధించింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏకమై వచ్చినా ఎదురొడ్డి చరిత్ర తిరగరాసే విజయాలు సాధించి యావత్ భారతదేశంలోనే పేరు గాంచింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ విలువలు కలిగిన రాజకీయాలు చేస్తూ ప్రజల మనస్సులో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. నిత్యం ప్రజా పక్షమై పోరాడుతూ ప్రజా నాయకుడిగా నిలిచిపోయారు. తాజాగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై.. అరాచకాలపై మరో పోరుబాటకు పిలుపునిచ్చారు.
చరిత్ర తిరగరాసిన ఉప ఎన్నికలు
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చిన అప్పటి ఎంపీ, ప్రస్తుత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అప్పటి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. వారు అందుకున్న విజయం చరిత్ర నివ్వెరపోయేలా పులివెందుల, కడప పార్లమెంటు ప్రజలు తీర్పునిచ్చారు. 2011 మే నెలలో జరిగిన ఉప ఎన్నికలు దేశ స్థాయిలో చర్చ జరిగేలా చేశాయి. ఆ ఉప ఎన్నికల్లో కడప ఎంపీ స్థానానికి సంబంధించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 5.44 లక్షలకు పైగా మెజార్టీతో అఖండ విజయం సాధించి పార్లమెంటు స్థాయిలో రికార్డు సృష్టించారు.
అనునిత్యం ప్రజల్లో.....అందుకే పట్టం!
2011 నుంచి ఇప్పటివరకు ప్రజానేతగా, ప్రతిపక్ష నేతగా, ప్రజల ముఖ్యమంత్రిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం అనునిత్యం వారి మధ్యే గడుపుతున్నారు. హోదా ఏదైనా ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ వారి మధ్యే గడుపుతూ ప్రజా హృదయనేతగా గుర్తింపు పొందారు. ప్రజా సంకల్పం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలతోపాటు 22 లోక్‌సభ స్థానాల్లో విజయఢంకా మోగించారు.
సంక్షేమ ముద్ర
రాష్ట్ర ప్రజల గుండెల్లో 2019–24 చరిత్రలో లిఖింపదగ్గ అధ్యాయంగా గుర్తింపు పొందింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేద ప్రజలఅభ్యున్నతికి కృషి చేశారు. తన హయాంలో పేద ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పథక రచన చేసి సఫలీకృతులయ్యారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి సరిగ్గా 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్బంగా పార్టీ తరఫున పలు కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పించారు. పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలతోపాటు దివంగత వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు, పూలమాలలతో ఘనంగా నివాళులర్పించనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానం నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
వైఎస్సార్ ఘాట్ నుంచే శ్రీకారం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం మొదలుకొని ప్రతి కార్యక్రమం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడి సమాధి ఘాట్ వద్ద నుంచే ప్రారంభిస్తూ వచ్చారు. వైఎస్సార్ సీపీ అధినేతగా ఇడుపులపాయ నుంచే పాదయాత్ర చేశారు. అలాగే పార్టీ ఆవిర్బావం...జెండా ఆవిష్కరణ....అభ్యర్థుల ప్రకటనలు....నామినేషన్ పత్రాలు...మొదటి ప్లీనరీ... ఇలా ఎలాంటి కార్య క్రమం తలపెట్టినా వైఎస్సార్ ఘాట్ వద్దకు వచ్చి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే ముందుకు కదిలేవారు.
15 వసంతంలోకి వైఎస్సార్ సీపీ
2011 మార్చి 12న వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం
వైఎస్సార్ సమాధి ఘాట్ వద్ద పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ
పార్టీ ఆవిర్భావమే ఓ సంచలనం!
ప్రజల గుండెల్లో వైఎస్సార్‌సీపీ జెండా!
Comments
Please login to add a commentAdd a comment