865 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో బాగంగా మంగళవారం 64 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు 865 మంది గైర్హాజరయినట్లు ఇంటర్ ఆర్‌ఐఓ బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇందులో జనరల్‌కు సంబంధించి 17195 మందికిగాను 747 మంది, ఒకేషనల్‌కు సంబందించి 1467 మందికిగాను 118 మంది గైర్హాజరయ్యారని వివరించారు.
నేడు ఖోఖో సీనియర్స్ ఎంపికలు
కడప ఎడ్యుకేషన్: చింతకొమ్మదిన్నె మండలం బయనపల్లి శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల స్థాయి ఖోఖో పురుషులు, మహిళలు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షుడు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి , కార్యదర్శి జె.నరేంద్ర తెలిపారు జిల్లా నుంచి ఎనిమిది మంది ఎంపిక చేసి ఈనెల 14, 15 తేదీల్లో పురుషులకు 16న మహిళలకు బాపట్ల జిల్లా జె.పంగులూరు ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో క్రీడా మైదానంలో డైరెక్ట్ నేషనల్ ఎంపికలు జరుగుతాయని వివరించారు.
రూటే..సప‘రేటు’
కథనానికి స్పందన
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవకతవకలపై గత శుక్ర వారం ‘సాక్షి’లో రూటే..సప‘రేటు’అనే కథనం ప్రచురితమైంది. దీనిపై కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పందించారు. సోమవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను పిలిపించి, సమగ్రంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన అంశాలపై సీరియస్ అయ్యారు. ఇలాంటి సంఘటనలు జరిగితే ఉపేక్షించేది లేదని చెప్పినట్లుగా సమాచారం. ఈ అంశంపై ఎలాంటి పరిణామాలు ఉంటాయో అని ఆ శాఖలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
మాలెపాడు సర్పంచ్
చెక్ పవర్ రద్దు
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని మాలెపాడు గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ శకుంతలమ్మ చెక్ పవర్ రద్దు అయినట్లు ఈఓపీఆర్డీ రంతులయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామంలో ఆర్టీపీపీ సీఎస్‌ఆర్ నిధులు, ఎంపీ నిధుల కింద రెండు వాటర్ ప్లాంట్లను నిర్మించారు. వీటి మెయింటైన్స్ కోసం ఆర్టీపీపీ సీఎస్‌ఆర్ కింద రూ.23,21,101 నిధులను ఇచ్చిందన్నారు. ఈ నిధులను గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా దుర్వినియోగం చేశారని తేలడంతో సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేస్తూ డీపీఓ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. చెక్ పవర్‌ను ఈఓపీఆర్డీకి ఇచ్చినట్లు పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప కల్చరల్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కడప జిల్లా శాఖలో అకౌంటెంట్ పోస్టుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రెటరీ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి అర్హత గలవారు పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలను ఈనెల 25వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా నగరంలోని మట్టి పెద్దపులివద్ద ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో నేరుగా అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు 08562 272829 లేదా 9441513490 నెంబరులో సంప్రదించాలన్నారు. ఎంపికై న అభ్యర్థికి రూ.11,700 గౌరవ వేతనం ఉంటుందని, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ పోస్ట్ కు తగిన అభ్యర్థిని ఎంపిక చేస్తారని తెలిపారు. కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు.
రేపు పులివెందులలో జాబ్‌మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, డిపార్టుమెంటు ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఈనెల 13వ తేది ఉదయం 9.30 గంటగలకు పులివెందులలో జాబ్‌మేళా నిర్వహించనున్నామని నిర్వాహకులు దివాకర్, చంద్రబాబులు తెలిపారు. పులివెందులలోని ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని నగిరిగుట్టలోని న్యాక్ సెంటర్‌లో ఈ జాబ్‌మేళా ఉంటుందని పేర్కొన్నారు. నవత ట్రాన్స్‌పోర్టు సంస్థలో క్లర్క్, డ్రైవర్లు, క్లీనర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. అభ్యర్థులు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి ఉండాలన్నారు. కొప్పర్తిలోని అల్ డిక్సన్ (కిరణ్ సర్వీసెస్) సంస్థలో అసెంబ్లింగ్ ఆపరేటర్స్ అండ్ క్వాలిటీ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులని వివరించారు. ఎంపికై న వారికి రూ. 12 వేల నుంచి రూ. 18 వేల వరకు వేతనాలు, ఇతర ప్రయోజనాలు ఉంటాయన్నారు. 30 ఖాళీలు ఉన్నాయని, అభ్యర్థులు 19–28 ఏళ్లలోపు కలిగి ఉండాలన్నారు. ఇతర వివరాలకు 96400 15507, 83744 91240 నెంబరులో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment