కడప సెవెన్‌రోడ్స్/దువ్వూరు : ఆ దర్గా ధర్మకర్తలు హిందువులు. ఉరుసు నిర్వహణలో ప్రధాన భూమిక వారిదే. మహోత్సవంలో పాల్గొనేందుకు విశేషంగా తరలివచ్చేదే వారే. హిందూ–ముస్లిం సఖ్యత, సామరస్యాలకు నిలువెత్తు ప్రతిరూపంగా భాసిల్లుతున్న దాని పేరు కృష్ణంపల్లె జమాలయ్య దర్గా. మైదుకూరు–ఆళ్లగడ్డ రహదారిలో కానగూడూరు గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంది. సుదూర ప్రాంతాల నుంచి సైతం కులమతాలకు అతీతంగా భక్తులు నిత్యం ఈ దర్గాను దర్శించి తరిస్తుంటారు. శుక్రవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా జమాలయ్యాను భక్తులు విశ్వసిస్తుంటారు.
కరువును పారదోలి..
అది 1876 నాటి తెలుగు ధాతనామ సంవత్సరం. చరిత్రలో పెను విషాదాన్ని మిగిల్చిన సంవత్సరం. వర్షాలు లేక భయంకర కరువు వచ్చింది. బ్రిటీషు పాలనలో సంభవించిన 31 కరువుల్లో ఇది ఎక్కువ నష్టం కలిగించింది. ఎక్కడా పంటలు సాగు కాలేదు. బావులు, చెరువులు, నదులు ఎండిపోయి మనుషులు, పశువులు తాగునీటికి విలవిల్లాడిపోయారు. మద్రాస్ శానిటరీ కమిషనర్ రాబర్ట్ కార్నిష్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల ప్రకారం తినడానికి తిండిలేక ఆకలి బాధతో జిల్లాలో వేలాది మంది మరణించారు. కలరా, మసూచి జ్వరాలు, పేగు సంబంధిత సమస్యల వల్ల మృత్యువాత పడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో, ఉపాధి పనుల ప్రదేశాల్లో సైతం జనం పిట్టల్లా రాలిపోయారు. పశు సంపదకు లెక్కేలేదు. మానవ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు దేవునివైపు చూడడం సహజం. పుష్పగిరి లాంటి ప్రముఖ ఆలయాల్లో ప్రభుత్వమే వరుణ యాగాలు చేయించింది. ఈ పరిస్థితుల్లో నంద్యాలకు చెందిన జమాల్‌వలీ సాహెబ్ రాజుపాలెం మండలంలోని వెలవలి గ్రామానికి వచ్చారు. దువ్వూరు మండలం కృష్ణంపల్లెకు చెందిన నాగిరెడ్డి ఓసారి ఏదో పనిమీద వెలవలి గ్రామానికి వెళ్లగా జమాల్‌వలీ సాహెబ్ ఆయన వెంట వచ్చేశారు. కరువు కాలంలో ప్రజల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన సమీపంలోని యేటిలో కూర్చొని కఠోర తపోదీక్ష చేపట్టారు. ఎట్టకేలకు జమాలయ్య సాహెబ్ తపము ఫలించి ప్రకృతి కరుణించడంతో భారీ వర్షాలు కురిశాయి. నదులు, చెరువులు, బావులు, కుంటలు పొంగి పొర్లడంతో ప్రజలు ఆనంద పరవశులయ్యారు. అప్పటి నుంచి జమాలయ్య జిల్లా ప్రజలకు ఆరాధ్యుడయ్యారు. 1883లో ఆయన తనువు చాలించారు. వెన్నపూస ఎరికలరెడ్డి, నాగిరెడ్డి సోదరులకు చెందిన పొలంలో జమాలయ్య దర్గా నిర్మాణం జరిగింది. నేటికీ ఆ వంశీయులే ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
142వ ఉరుసు మహోత్సవం
ప్రతియేటా ఫాల్గుణ పౌర్ణమి రోజున గంధం, పాడ్యమి రోజు ఉరుసు మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈనెల 14వ తేదీ శుక్రవారం రాత్రి గంధం, 15న శనివారం ఉరుసు మహోత్సవాలు జరగనున్నాయి. 142వ ఉరుసు నిర్వహణ కోసం దర్గాను ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే దర్గాకు రంగులుఅద్ది విద్యుద్దీపాలు, చలువ పందిళ్లు వంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిరంతరాయ విద్యుత్ సరఫరా, తాగునీరు, వైద్య శిబిరం, 108, పటిష్ట పోలీసు బందోబస్తు లాంటి ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. శుక్రవారం సాయంత్రానికి ప్రొద్దుటూరుకు చెందిన ముస్లింలు గంధం తీసుకొస్తారు. ధర్మకర్తల ఇంటి నుంచి మేళతాళాలు, బాణాసంచా పేలుళ్ల వంటి కార్యక్రమాల మధ్య గ్రామంలో చాందినీలో గంధం ఊరేగింపు నిర్వహిస్తారు. ఉరుసు రోజు రాత్రి జెండా ఊరేగింపు ఉంటుంది. ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు వస్తారు గనుక ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా గ్రామానికి చెందిన దాతలు అన్నదానం, మరుగుదొడ్ల సౌకర్యం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు.
15న బండలాగుడు పోటీలు
ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఈనెల 15న ధర్మకర్తల ఆధ్వర్యంలో బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 6.30 గంటలకు ధర్మకర్త పుల్తారెడ్డి ఇంటి వద్ద చీటీలు పంపిణీ చేస్తారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారిలో ప్రథమ బహుమతిగా రూ. 30,116లను వెన్నపూస పెద్ద పుల్లారెడ్డి, ద్వితీయ బహుమతిగా రూ. వెన్నపూస చిన్న పుల్లారెడ్డి రూ. 20,116, తృతీయ బహుమతిగా వెన్నపూస సాయినాథరెడ్డి రూ. 10,116, నాల్గవ బహుమహతిగా వెన్నపూస రమ్యశ్రీ రూ. 5,116 అందజేస్తారు. అదేరోజు రాత్రి కృష్ణంపల్లె కళాకారులు సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించనున్నారు.
కరువును పారదోలిన తాపసిగా గుర్తింపు
14, 15న కృష్ణంపల్లె ఉరుసు మహోత్సవం
విశేష సంఖ్యలో తరలిరానున్న భక్తులు
ఏర్పాట్లలో నిమగ్నమైన నిర్వాహకులు
కోర్కెలు తీర్చే కల్పతరువు
భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా జమాలయ్య స్వామి ప్రసిద్ధుడు. సంతానం పొందిన భక్తులు ముస్లింలైతే తమ పిల్లలకు జమాల్‌వలీ, జమాల్‌బాషా, హిందువులైతే జమాల్‌రెడ్డి, జమాలయ్యా అనే పేర్లు పెట్టుకోవడం జిల్లాలో సర్వసాధారణం. ఉరుసు ఉత్సవాల్లో ప్రొద్దుటూరు నుంచి ముస్లింలు గంధం తీసుకొస్తే, మా ఇంటి నుంచి మేము జెండా మెరవణి చేపడతాము. ఉరుసు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి.
– వెన్నపూస పుల్లారెడ్డి, ధర్మకర్త
ఘనంగా ఉరుసు మహోత్సవం
రెండు రోజులపాటు గంధం, ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడవరోజు జియారత్ కార్యక్రమం ఉంటుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, నంద్యాల నుంచే కాకుండా గుంటూరు, తెనాలి ప్రాంతాల నుంచి కూడా భక్తులు ప్రత్యేక బస్సుల్లో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ అన్నదాన సత్రం ఉంది. ఎప్పటిలాగా భక్తులు తరలివచ్చి ఉత్సవాలు విజయవంతం చేయాలి.
– సయ్యద్ జమాల్‌బాషా, ముజావర్, జమాలయ్య దర్గా
Comments
Please login to add a commentAdd a comment