● రాత్రింబవళ్లు 4 జేసీబీలతో..
జగనన్న కాలనీ ఎస్‌టీపీ రెండో లే ఔట్ పైన నానాపల్లె, వైఎస్సార్ కాలనీ సమీపాన ఎన్‌జీఓ కాలనీకి చెందిన ఇద్దరు టీడీపీ బ్రదర్స్ 3 జేసీబీలతో గ్రావెల్ అక్రమ రవాణా సాగిస్తున్నారు. యానాది కొట్టాల వద్ద మరో జేసీబీతో తవ్వుతున్నారు. పదుల సంఖ్యలో టిప్పర్లు ఏర్పాటు చేసి టన్నుల కొద్దీ మట్టిని మాయం చేస్తున్నారు. కాలువల పక్కనున్న పొరంబోకు స్థలాలు, వివాదాస్పద డీకేటీ స్థలాల్లో మకాం వేసి ఈ మట్టిని ఆయా ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. లీజు క్వారీల నుంచి మట్టి తోలితే ఒక టిప్పరుకు రూ.1750లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. వీరు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా...ప్రభుత్వానికి రూపాయి కూడా చెల్లించకుండా కేవలం రూ.4000 నుంచి రూ.5000లకు టిప్పర్ మట్టిని తోలుతూ జేబులు నింపుకుంటున్నారు. లీజు క్వారీలకు అనుమతి ఉన్నవారిని సామ, దాన, భేద, దండోపాయాల ద్వారా బెదిరించి క్వారీలు మూయించిన అధికార పార్టీ నేతలు, తమ టిప్పర్లతో విచ్చలవిడిగా అక్రమ రవాణా చేస్తున్నారు. వైఎస్సార్ కాలనీకి పోయే మార్గంలోనే ఇదివరకు చెక్‌పోస్టు ఉండేది. అది ఉన్నప్పుడు ఎంతోకొంతైనా రాయల్టీ ప్రభుత్వానికి దక్కేది. ఇప్పుడు ఆ చెక్‌పోస్టు కూడా ఎత్తేయడంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. సామాన్యులు, చిన్నా, చితకా వారి నుంచి ముక్కుపిండి రాయల్టీ వసూలు చేసే మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు.... ఫోన్లు చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రింబవళ్లు టిప్పర్లతో మట్టి తోలడం వల్ల రోడ్లు గుంతలమయంగా మారాయి. పక్కనున్న జగనన్న కాలనీలు ఎర్రటి మట్టితో నిండిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment