ప్రాణం తీసిన ఈత సరదా
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని హనుమనగుత్తి గ్రామానికి చెందిన గోటూరు సుబ్బరాయడు కుమారుడు గోటూరు మంజుగోపాల్ (9) సరదాగా ఈతకు వెళ్లి పెన్నానదిలో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. అదే గ్రామానికి చెందిన స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గోటూరు సుబ్బరాయుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు. మధ్యాహ్నం సమయంలో స్నేహితులతో కలసి మంజుగోపాల్ సమీపంలో ఉన్న పెన్నానదికి వెళ్లాడు. పెన్నానదిలో అనేక పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఆ గుంతలలో సరదాగా స్నేహితులతో కలసి ఈతకు దిగాడు. అంతే గుంతలోని అడుగు భాగంలో మంజుగోపాల్ ఇరుక్కున్నాడు. పైకి రాకపోవడతో వెంటనే స్నేహితులు మంజుగోపాల్ తండ్రి సుబ్బరాయుడుకి సమాచారం అందించారు. వెంటనే స్థానికుల సాయంతో బాలుడిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రలు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment