
రైతన్న ఉసురు తీసిన అప్పులు
ఖాజీపేట : సాగుచేసిన పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడం, సరైన దిగుబడి రాక పోవడంతో ఏటా సాగు వ్యయం పెరిగింది. చేసిన అప్పులు తీరడం లేదు. వడ్డీల మీద వడ్డీలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనో వ్యథతో ఓ యువ రైతు తన పంట పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఖాజీపేట మండలం బి.కొత్తపల్లె పంచాయతీలోని బక్కాయపల్లె గ్రామానికి చెందిన పత్తి రామచంద్రారెడ్డి (42) చురుకై న వ్యవసాయ యువ రైతు. తనకు 2.50 ఎకరాల పొలం ఉంది. ఈ పొలంతో పాటు అదనంగా 10 ఎకరాలను గుత్తకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో పంటలు సాగు చేసేవాడు. ముఖ్యంగా వరి, వేరుశనగతోపాటు పలురకాల పంటలు సాగు చేసేవాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా పంట దిగుబడి వస్తే మార్కెట్‌లో సరైన గిట్టుబాటుధర లేక పోవడం, ఇలాగే మార్కెట్‌లో ధర ఉన్నప్పుడు సరైన దిగుబడి రాక పోవడం జరిగేది. దీంతో పండించిన పంటలపై సరైన ఆదాయం లేదు. పొలం గుత్త చెల్లించలేక ఏటా నష్టాలను చవిచూడాల్సి వచ్చేది. పంట సాగు కోసం ఏటా అప్పులు తీసుకురావడం.. ఆ అప్పులు తీరక ముందే పంట సాగు చేసే ప్రయత్నంలో తిరిగి అప్పు లు చేయడం మామూలైంది. ఫలితంగా అప్పులు అధికమై తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు.
పొలంలోనే ఆత్మహత్య..
ఏటా తాను సాగుచేసే పంటలకు అప్పులు తీసుకు రావడం వల్ల సుమారు రూ.15లక్షల మేరకు అప్పులు అయ్యాయి. వచ్చే సీజన్‌లో పంటలు సాగుచేస్తే ఆదాయం వస్తుందన్న నమ్మకాన్ని రైతు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఈనెల 18వ తేదీ మంగళవారం రాత్రి పొలంలో పంటకు నీరు పట్టి వస్తానని ఇంటిలో చెప్పి పొలం వద్దకు వెళ్లాడు. పొలంలోనే పురుగుల మందు తాగి అక్కడే పడిపోయాడు. పొలంలో పడిపోయి ఉన్న రైతును చూసి మరో రైతు పిలిచాడు. ఎంతకూ పలకక పోవడంతో దగ్గరకు వెళ్లి చూడగా చనిపోయినట్లు గమనించి గ్రామస్తులకు సమాచారం చేరవేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పొలం వద్దకు చేరుకుని పత్తి రామచంద్రారెడ్డి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.
కేసు నమోదు
మృతి చెందిన రైతు భార్య పత్తి శిరీషా ఫిర్యాదు మేరకు ఖాజీపేట సీఐ మోహన్ కేసు నమోదు చేశారు. కడప రిమ్స్‌లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బుధవారం సాయంత్రం బంధువులు అంత్యక్రియలు నిర్వహంచారు.
పురుగుల మందు తాగి
యువ రైతు ఆత్మహత్య

రైతన్న ఉసురు తీసిన అప్పులు
Comments
Please login to add a commentAdd a comment