ప్రజల గుండెల్లోంచి వైఎస్సార్‌ను చెరపలేరు
కడప కార్పొరేషన్: జిల్లా పేరు మార్చవచ్చేమోగానీ, ప్రజల గుండెల్లోంచి వైఎస్సార్‌ను చెరపలేరని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 680 మంది చనిపోయారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎవరు చనిపోయినా కూడా ఇంతమంది మరణించలేదన్నారు. తమిళనాడులో ఎంజీఆర్ చనిపోయినప్పుడు మాత్రమే కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వైఎస్సార్ పాలన ఒక చరిత్ర అన్నారు. ఎన్నికల్లో చెప్పినవేగాక, చెప్పనివి ఎన్నో ఆయన అమలు చేసి చూపారన్నారు. వైఎస్సార్ పేరు చెప్పగానే చరిత్రాత్మకంగా గుర్తుండిపోయే ఎన్నో పథకాలు స్ఫురణకు వస్తాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత కరెంటు, జలయజ్ఞం, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఆయన ప్రవేశపెట్టినవేనన్నారు. కోటి ఎకరాలకు నీరివ్వాలని లక్ష కోట్లతో జలయజ్ఞం మొదలు పెట్టారని, మనం కాకపోయినా వేరెవరైనా వాటిని పూర్తి చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావించారన్నారు. పోలవరం, గాలేరునగరి సుజల స్రవంతి, హెచ్‌ఎన్‌ఎస్‌స్, వెలిగొండ, సోమశిలతోపాటు తెలంగాణలో కూడా 45 శాతం ప్రాజెక్టులు చేపట్టారన్నారు. నేడు ఇంతమంది చదివారు అంటే వైఎస్సార్ ప్రవేశపెట్టి ఫీజు రీయింబర్స్‌మెంటే కారణమన్నారు. ఈ పథకం ద్వారా వేలాదిమంది డాక్టర్లు, ఇంజినీర్లుగా తయారయ్యారని తెలిపారు. వైద్యానికి సంబంధించి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టాలన్న ఆలోచన కూడా ఎవ్వరికీ రాలేదన్నారు. స్వతహాగా వైద్యుడైనందునే వైఎస్సార్ ఆ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఏపీలో చూసి ప్రతి రాష్ట్రంలో దాన్ని అమలు చేశారన్నారు. పేదలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లలో నాణ్యమైన వైద్యం చేయించారన్నారు. ప్రజల బాగు కోసం నిరంతరం పరితపించిన ట్రెండ్ సెట్టర్ వైఎస్సార్ అన్నారు. ఆయన చనిపోయాక 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాకు వైఎస్సార్ జిల్లాగా పేరు మార్చిందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డో, అభిమానులో పెట్టింది కాదన్నారు. ఆ పేరును కూటమి ప్రభుత్వం మార్చడం దురదృష్టకరమని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలా పాలించలేదని, ఎన్‌టీఆర్, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్‌ల పేర్లు జిల్లాలకు పెట్టారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పేర్లన్నీ తీసేస్తున్నారని మండిపడ్డారు. వైజాగ్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వాళ్లు పేరు పెట్టుకుంటే ఆది కూడా తీసేశారన్నారు. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ప్రభుత్వం మారగానే తీసేశారన్నారు. పేరు తొలగించినంత మాత్రాన వారిపై ప్రజలకున్న గౌరవం తొలగించలేరన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిందేమీ లేదుగానీ, ఇలా దోపిడీ, దుర్మార్గాలను చేస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు గురి చేసి ఆస్తులను నష్ట పరుస్తున్నారన్నారు.దేశమంతా అంబేడ్కర్ రాజ్యాంగం నడుస్తుంటే, ఏపీలో మాత్రం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని తూర్పారబట్టారు. గతంలో ఎన్‌టీఆర్, చంద్రబాబు సీఎంలుగా ఉన్నప్పుడు కూడా ఇలా జరగలేదన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, కచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని బాగుపరుస్తారనే ఆశతో ప్రజలు ఓట్లు వేశారని, ఇచ్చిన అఽధికారాన్ని సద్వినియోగపరచుకుని ప్రజల మనసులు గెలవాలని రవీంద్రనాథ్‌రెడ్డి హితవు పలికారు. అంతే తప్ప ప్రకృతి వనరులను ధ్వంసం చేసి మట్టి, ఇసుకను దోచుకోవడం, లోకల్ ట్యాక్స్ వసూలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల హామీలు అమలు పరచకపోతే వైఎస్సార్‌సీపీ ఉద్యమాల ద్వారా మెడలు వంచి చేయిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్, బీహెచ్ ఇలియాస్, ఎస్‌ఏ కరిముల్లా, ఎస్‌ఎండీ షఫీ, కిరణ్ పాల్గొన్నారు.
పేరును చెరపగలరేమోగానీ...ప్రజల్లో ఆయనకున్న గౌరవాన్ని కాదు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment