పంటలు కాపాడండి సారూ!
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలోని కేసీ కెనాల్ కింద రైతులు సాగు చేసిన పంటలకు నీరిచ్చి కాపాడాలని జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అచ్చుకట్ల కరీముల్లా కోరారు. శుక్రవారం జెడ్పీ చైర్ పర్సన్ జేష్ఠాది శారద అధ్యక్షతన నిర్వహించిన జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల వరకు కేసీ కెనాల్ కింద రైతులు వివిధ పంటలు సాగు చేశారని తెలిపారు. వచ్చేనెల 15వ తేది వరకు సాగు నీరు అందితే తప్ప పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదన్నారు. కొండపేట కాలువ పూడికతీత పనులు చేపట్టాలని కోరారు. ఇందుకు కేసీ కెనాల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు చిన్న పుల్లయ్య బదులిస్తూ కుందూనదిలో నీరున్నంత వరకు కేసీ కెనాల్‌కు సాగునీరు అందిస్తామన్నారు. వెలుగోడు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 4.4 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మైలవరం నుంచి నీరు విడుదల చేసే అంశం తమ పరిధిలో లేదని, కడప చీఫ్ ఇంజనీరును సంప్రదించాలని సూచించారు.
● వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి మాట్లా డుతూ తమ మండలంలో వివిధ గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొందని తెలిపారు. బోర్ల డీపెనింగ్, ఫ్లషింగ్, అవసరమైనచోట తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. ఇంతకుముందు తాగునీటి రవాణాకు సంబంధించిన బిల్లులను ఇంతవరకు చెల్లించకపోవడం విచారకరమన్నారు.
● పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండు నిర్మాణం కోసం గతంలో టెండరు పిలిచారని తెలిపారు. ఫలానా స్థలంలో బస్టాండు నిర్మించాలని కూడా అధికారులు సూచించారన్నారు. కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి అధికారులు చూపిన స్థలంలో రెండున్నర లక్షలు ఖర్చు చేసి గ్రావెల్ తోలాడని చెప్పారు. తీరా ఇప్పుడు ఆర్టీసీ బస్టాండు నిర్మించాల్సిన స్థలం అది కాదని అధికారులు చెప్పడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నవంబరు నుంచి దరఖాస్తు చేసుకున్న వితంతువులకు పెన్షన్ మంజూరు చేస్తామంటోందని, అంతకుమునుపు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా పెన్షన్‌మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, పలు మండలాల జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లోసభ్యుల వినతి
పంటలు కాపాడండి సారూ!
Comments
Please login to add a commentAdd a comment