మాతా శిశు సంరక్షణే ధ్యేయం
కడప కోటిరెడ్డిసర్కిల్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) పథకం మాతా శిశు సంరక్షణ కోసం దోహదపడుతోంది. పేద, మధ్యతరగతికి చెందిన గర్భిణులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఈ పథకాన్ని మొదట 2010లో నాటి కేంద్ర ప్రభుత్వం మాతృత్వ సహయోగ్ యోజన (ఐజీఎంఎస్‌వై) పథకంగా ప్రారంభించింది. అయితే ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక 2016లో ఈ పథకాన్ని ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనగా మార్చారు. ఈ పథకం మరింత మందికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పథకాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మరిన్ని మార్పులు చేసిన తర్వాత అమలులోకి తీసుకొచ్చారు. పీఎంఎంవీవై ద్వారా అందించే నగదు ప్రోత్సాహాకాల ద్వారా గర్భిణులు, బాలింతల్లో మెరుగైన ఆరోగ్య కల్పనకు, నవజాతా శిశు సంరక్షణకు, వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
నమోదు ప్రక్రియను నిరంతరం:
జిల్లాలో 13,256 మంది గర్భిణులను నమోదు చేశారు. వీరి అందిరికీ ఇప్పటివరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. గర్భిణులకు వర్తింపజేసే విధంగా నమోదు ప్రక్రియను ఆరోగ్య సిబ్బంది నిరంతరం నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో గర్భిణుల గుర్తించి వైద్యశాఖ రికార్డుల్లో పొందుపరుస్తున్నారు. దీంతోపాటు గత మూడేళ్లుగా నమోదు చేసుకుని చిన్నారుల తల్లులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
పీఎంఎంవీవై పథకానికి అర్హతలు :
● గర్భం దాల్చిన మూడు నెలల్లోపు పీఎంఎంవీవై పథకం కోసం వార్డు, గ్రామ సచివాలయంలోని వెల్‌నెస్ సెంటర్‌లో పేరు నమోదు చేసుకోవాలి.
● గర్భిణులు తప్పనిసరిగా మదర్ చైల్డ్ ప్రొటెక్షన్ (ఎంసీపీ) కార్డు కలిగి ఉండాలి.
● 19 సంవత్సరాలు నిండిన తర్వాత గర్భం దాల్చిన మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.
● పీహెచ్‌సీ, అర్బన్ హెల్త్ సెంటర్లలో ప్రతినెల 9వ తేదీన నిర్వహిస్తున్న పీఎంఎంవీవై శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలి.
నగదు చెల్లింపు ఇలా..
● గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం పూర్తయ్యేలోపు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా మూడు విడతల్లో రూ. 5 వేలు చెల్లిస్తుంది.
● మొదటి విడతగా అంగన్వాడీ కేంద్రం లేదా గ్రామ సచివాలయంలో గర్భిణీగా నమోదైన వెంటనే రూ. 1000 లబ్ధిదారునికి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
● ఆరు నెలలపాటు క్రమం తప్పకుండా వైద్య పర్యవేక్షణ తీసుకున్న గర్భిణికి రెండవ విడతగా రూ. 2 వేలు అందజేస్తారు.
● ప్రసవం అయిన తర్వాత మూడవ విడతగా రూ. 2 వేలు చెల్లిస్తారు.
పీఎంఎంవీవై కింద రూ. 5 వేల సాయం
గర్భిణులకు మూడు విడతలుగా చెల్లింపు
రెండవ కాన్పులో ఆడపిల్ల పుట్టినా పథకం వర్తింపు
జిల్లా వ్యాప్తంగా 13256 మంది గర్భిణులు
సద్వినియోగం చేసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవజాతా శిశువు తల్లుల సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన పీఎంఎంవీవై పథకాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతినెలా అర్బన్ హెల్త్ సెంటర్లలో గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. నిర్ణీత సమయంలో వివరాలు నమోదు చేసుకుని పథకం లబ్ధిని పొందాలి. ఇప్పటికే ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీలకు అవగాహన కల్పిస్తున్నాం. – దేవిరెడ్డి శ్రీలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ, కడప
విస్తృత ప్రచారం చేస్తున్నాం
పీఎంఎంవీవై పథకం ఆవశ్యకత గురించి, గర్భిణులకు కలిగే ప్రయోజనాలపై విరివిగా అవగాహన కల్పిస్తున్నాం. అర్హులందరికీ ఈ పథకం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. గర్భిణులను నమోదు చేసి ప్రతి ఒక్కరికీ ఎంసీపీ కార్డును అందజేస్తున్నాం. – సుజాత, ఏఎన్‌ఎం, కడప
మాతా శిశు సంరక్షణే ధ్యేయం
మాతా శిశు సంరక్షణే ధ్యేయం
మాతా శిశు సంరక్షణే ధ్యేయం
Comments
Please login to add a commentAdd a comment