మెడికల్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
కడప అర్బన్ : ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్త ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈగల్ డ్రగ్స్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో శుక్రవారం మందుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల పరంగా ఈ దాడులను కొనసాగిస్తున్నారు. కడప నగరంలోని జనతా మెడికల్ స్టోర్ లో విజిలెన్స్ అధికారి శ్రీనివాసరావు, డ్రగ్ ఇన్స్పెక్టర్ మాధవి ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు డాక్టర్ పర్యవేక్షణలోనే, వారి ప్రిస్కిప్షన్‌ల మేరకు మాత్రమే నార్కోటిక్ మందులు వినియోగించాల్సి ఉంటుందని, అయితే కొంతమంది యువత డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే మత్తు ట్యాబ్లెట్లు తీసుకొని మత్తులో జోగుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. మెడికల్ దుకాణాల్లో మత్తుమందులు ఏవైతే ఉన్నాయో, ఆ మందులను యువత కొనుగోలు చేసి సేవిస్తున్నారన్నారు.. వివిధ కాంబినేషన్లోని మందులు మానసిక రుగ్మతలు ఉన్న రోగులకు, కొన్ని రకాల జబ్బులు నయమయ్యేమందుకు మాత్రమే వీటిని వినియోగించాల్సి ఉంటుందన్నారు. కొందరు యువత డాక్టర్ అనుమతి లేకుండానే మత్తు టాబ్లెట్లు కొనుగోలు చేస్తున్నారన్నారు. వీటిని సేవించడం వల్ల యువత నేరాలకు పాల్పడుతున్నారన్నారు. కడపలో జనత మెడికల్ స్టోర్‌లో తనిఖీలు నిర్వహించామని అయితే ఇక్కడ మందులు కొనుగోలు విక్రయాలు స్టాకు వివరాలపై వ్యత్యాసం ఉందన్నారు. మెడికల్ స్టోర్స్ నిర్వాహకులకు, మెడికల్ రెప్స్‌కు అవగాహన కల్పిస్తున్నామన్నారు. దాడుల్లో విజిలెన్స్ సీఐ శంకర్ రెడ్డి, అగ్రికల్చర్ అధికారి బాలగంగాధర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment