
●రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్‌గిరి
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా పరిషత్ చైర్మన్ సీటు మరోసారి వైఎస్సార్‌సీపీ సొంతం కానుందా... అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పూర్తి సంఖ్యా బలంతో వైఎస్సార్‌సీపీ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతుండగా.. బలం లేక టీడీపీ వెనకంజలో ఉంది. కాగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఆదివారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈనెల 27న చైర్మన్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రక్రియను కొనసాగించనున్నారు. గురువారం ఉదయం 10గంటలకు నామినేషన్ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 1గంటలకు నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. అనంతరం ఎన్నిక ప్రక్రియను కొనసాగించనున్నారు.
జిల్లాలో 50 జెడ్పీటీసీ సభ్యులు..
జిల్లాలో 50 మంది జెడ్పీటీసీల్లో పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి ఓ ప్రమాదంలో చనిపోయారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి జడ్పీ చైర్మన్‌గా కొనసాగుతూ రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జెడ్పీకి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గోపవరం జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి మాత్రమే టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. మిగతా 49 మంది జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్‌సీపీ నుంచి ఎన్నికై న వారే. వారిలో రెండు స్థానాలు ఖాళీలతోపాటు, 5మంది పార్టీ ఫిరాయించారు.
వైఎస్సార్ సీపీకి పూర్తి సంఖ్యా బలం
వైఎస్సార్‌సీపీ 42 మంది జెడ్పీటీసీ సభ్యుల బలంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. పార్టీ ఫిరాయించిన 5మంది జెడ్పీటీసీలకు సైతం విప్ జారీ చేయనున్న నేపధ్యంలో వారు కూడా వైఎస్సార్‌సీపీని బలపర్చేందుకు సన్నద్ధులైనట్లు సమాచారం. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో అధికార తెలుగుదేశం పార్టీ చైర్మన్ ఎన్నికపై వెనుకంజ వేయనున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అలా కాకుండా పోటీకి సిద్ధమైతే అభాసుపాలైతామనే భావన కూడా ఆ పార్టీ పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తిరుపతి కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికల్లో బలం లేకపోగా, అధికారం ప్రయోగించి చేజిక్కించుకున్న పరిస్థితి కారణంగా ప్రజలల్లో టీడీపీ అభాసుపాలయ్యింది. ఈ పరిస్థితులల్లో కడపలో అలాంటి ప్రయోగం చేయరాదనే దిశ గా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ల మధ్య ఉన్న ఐక్యత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమన్వయం నేపధ్యంలో వైఎస్సార్‌సీపీ సునాయసంగా చైర్మన్‌గిరిని కై వసం చేసుకోనున్నట్లు పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
పూర్తి సంఖ్యా బలంతో ఆత్మవిశ్వాసంలో వైఎస్సార్‌సీపీ
నేడే జెడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ!
27న ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కలెక్టర్ సన్నాహాలు
అదే రోజు నామినేషన్ స్వీకరణ, చైర్మన్ ఎన్నిక
బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ ముత్యాల రామగోవిందురెడ్డికి జెడ్పీ చైర్మన్‌గిరి దక్కనున్నుట్లు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు వెల్లడిస్తున్నారు. రెండు పర్యాయాలుగా అక్కడి నుంచి జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదివరకే పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా ఆ మేరకు గురు, శుక్రవారాల్లో ఆ పార్టీ నేతలు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జెడ్పీటీసీ సభ్యులతో సైతం సమాలోచనలు చేశారు. చైర్మన్‌గిరిని కై వసం చేసుకునేందుకు, కలిసికట్టుగా ఎన్నిక ప్రక్రియ వ్యవహారం నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ జెడ్పీ చైర్మన్‌గిరి స్థానాన్ని పార్టీకి పదిలంగా ఉంచుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

●రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్‌గిరి

●రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్‌గిరి
Comments
Please login to add a commentAdd a comment