● ఒక రోజు విధుల బహిష్కరణకే రోగులకు ఇక్కట్లు
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయం వద్ద వైద్య మిత్రల నిరసన (ఫైల్) పుష్పగిరి హాస్పిటల్‌లో వైద్య మిత్ర కౌంటర్ వద్ద వేచి ఉన్న రోగులు, వారి సహాయకులు (ఫైల్)
కడప రూరల్: ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’లో పని చేస్తున్న వైద్య మిత్రలు, ఇతర సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మచ్చుకై నా చొరవ చూపడం లేదు. దీంతో ఉద్యోగులు దశల వారీగా విధుల బహిష్కరణ..శాంతి యుత నిరసనలను తెలుపుతున్నారు. అటు వైద్య సేవలో పని చేస్తున్న ఉద్యోగులను, ఇటు వైద్య సేవలకు ఆటంకం ఏర్పడితే పేదలు ఎదుర్కొనే సమస్యలను కూటమి పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఉద్యోగ భద్రత కోసం...
టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతోనే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా పేరును మార్చారు. కాగా పేరు మార్పుతోపాటు పథకంలో కూడా అనూహ్యమైన మార్పులను తీసుకు రావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అందులో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని.. రాష్ట్రంలో కూడా తీసుకు వచ్చి ఆ పథకానికి బీమాను అనుసంధానం చేయడానికి చర్యలు చేపట్టడం మొదలు పెట్టింది. దీంతో ఏళ్ల తరబడి ఆరోగ్యశ్రీని నమ్ముకుని పని చేస్తున్న ఆరోగ్యమిత్రల్లో (నేడు వైద్య మిత్రలు) ఆందోళన మొదలైంది. ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ పరిధిలోకి వెళితే.. ఆ సంస్థకు చెందిన వారు తమను తీసివేసి మరొకరిని నియమిస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికితోడు ఈ వైద్య సేవలు బీమా పరిధిలోకి వెళితే వ్యాధుల సంఖ్యతోపాటే ప్యాకేజీ గణనీయంగా తగ్గనుంది. దీంతో ఆరోగ్యశ్రీలో ఉండే ప్రయోజనాలు, బీమా వల్ల వచ్చే ఉపయోగాలు ఏమాత్రం ఉండవన్నది స్పష్టంగా అర్థమవుతోంది. సమస్యలు పరిష్కారం కానందున..
ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పని చేస్తున్న వైద్య మిత్రలు, తమ ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నిరవధికంగా సమ్మెకు వెళ్లడానికి సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. 2024 నవంబరు 13వ తేదీన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సీఈఓ డాక్టర్ డి.లక్ష్మిషాతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు ఏమాత్రం కొలిక్కి రాలేదు. ఈ సందర్భంగా సీఈఓ లక్ష్మిషా కొన్ని రోజులు ఆగాలని చెప్పడంతో ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది ఓపిక పట్టారు. నెలలు గడుస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో.. మళ్లీ ఆందోళన బాట పట్టడానికి శ్రీకారం చుట్టారు.
‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’లో నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య మిత్రలు కీలకమైన విధులను నిర్వర్తిస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రులకు వచ్చే రోగుల వివరాలను ‘వైద్య మిత్ర’లు తెలుసుకుంటారు. అర్హులైన వారి పేరును ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేస్తారు. తరువాత ఆ వ్యాధిగ్రస్తుడిని వైద్య పరీక్షల కోసం వైద్యుడి వద్దకు తీసుకెళ్తారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులు ఇచ్చి ఔట్ పేషెంట్‌గా ట్రీట్ చేస్తారు. సర్జరీ లాంటి వైద్యం అవసరం అయితే ఇన్ పేషెంట్‌గా చేర్చుకుంటారు. తరువాత ఆ వ్యాధిగ్రస్తుడు డిశ్చార్జ్ అయ్యే వరకు పర్యవేక్షణ బాధ్యతలను ‘వైద్య మిత్ర’లే చూసుకుంటారు.
ఈ నెల 17వ తేదీన (సోమవారం) వైద్యమిత్రలు ఒక రోజు నిధులను బహిష్కించి, నూతన కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం తమ సమస్యల పరిష్కారం కోసం జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. కాగా ఈ ఒక్క రోజు వైద్య మిత్రలు విధులను బహిష్కరించినందుకే పేదలైన రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం వైద్య మిత్రల రోల్‌ను ఆసుపత్రులకే అప్పగించింది. అయినా కూడా ఆ రోజు వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చిన రోగులకు ఏ మాత్రం వైద్యం అందలేదు. అత్యవసరమైన ఇన్ పేషెంట్స్ రోగులను చేర్చుకుంటామని ఆసుపత్రుల సిబ్బంది చెప్పినా అది ఆచరణ సాధ్యం కాలేదు. ఇక ఓపీ (ఔట్ పేషెంట్స్)ను అయితే కనీసం పరీక్షించలేదు. దీంతో అస్వస్థతకు గురైన వారంతా చాలా.. చాలా ఇబ్బందులకు గురయ్యారు. కొంత మందైతే ఓపీ కింద డాక్టర్‌కు ఫీజులు చెల్లించి చూపించుకున్నారు. ఇంత జరుగుతున్నా ఆ శాఖ అధికారులతోపాటు ప్రభుత్వం సైతం ‘అంతా బాగానే ఉందని’ చెప్పుకోవడం గమనార్హం. మళ్లీ సోమవారం వైద్య మిత్రలు విధులను బహిష్కరించి, నిరసన తెలపనున్నారు.
● ఒక రోజు విధుల బహిష్కరణకే రోగులకు ఇక్కట్లు
Comments
Please login to add a commentAdd a comment