దెబ్బతిన్న అరటి తోటలను నేడు వైఎస్ జగన్ పరిశీలన
పులివెందుల: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం 8.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలంలో అరటి తోటలను పరిశీలిస్తారు. తాజాగా తీవ్ర ఈదురుగాలులతో లింగాల మండలంలో వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది. నష్టపోయిన అరటి రైతులతో మాట్లాడతారు. అనంతరం వేంపల్లెలో జెడ్పీటీసీ రవి నివాసంలో జరిగే శుభకార్యానికి హాజరవుతారు. తర్వాత ఇడుపులపాయ చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
నేడు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
కడప సెవెన్‌రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ సభాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ‘ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతోపాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో కూడా సమర్పించుకోవచ్చునన్నారు.
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందని డీఆర్వో తెలిపారు. ప్రజలు 08562–244437 ల్యాండ్‌లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నేడు గోవిందమాంబ
ఆరాధన మహోత్సవం
బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రభోదకర్త మద్విరాట్ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ధర్మపత్ని మాతా గోవిందమాంబ ఆరాధన మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఫిట్‌పర్సన్ శంకర్‌బాలాజీ ఆధ్వర్యంలో మేనేజర్ ఈశ్వరాచారి ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేయనున్నారు. అమ్మవారికి చీరె, సారె తదితరాలు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు సమర్పించనున్నారు. ఇందులో భాగంగా విజయవాడ నుంచి దాదాపు 200 మంది మహిళలు వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాత్రి గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్రస్వామి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
29న తాళ్లపాకలో
నాటక ప్రదర్శనలు
రాజంపేట టౌన్: అన్నమయ్య 522వ వర్ధతిని పురస్కరించుకొని ఈనెల 29వ తేదీ రాత్రి 7 గంటల నుంచి తాళ్లపాక ధ్యానమందిరం ఆవరణలో ఉచితంగా నాటకాలను ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని అన్నమయ్య కళాకారుల ఐక్యవేదిక రాజంపేట అధ్యక్షుడు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నాటకాల ప్రదర్శన జరుగుతుందని తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డీడీయూ జీకేవై పథకం ద్వారా సీ–డ్యాప్ సౌజన్యంతో నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు నాలుగు నెలల కాలవ్యవధిలో ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్టు ఆ సంస్థ రీజినల్ కోఆర్డినేటర్ సుబ్బరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణలో కంప్యూటర్ హార్డ్‌వేర్‌కు పదవ తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణత, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌కు ఇంటర్ లేదా డిగ్రీ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉత్తీర్ణత, జూనియర్ సాఫ్ట్‌వేర్ వెబ్ డెవలపర్ ఇంటర్ ఉత్తీర్ణత, బ్యూటీ థెరపీకి పదవ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు ఈ శిక్షణ కోర్సులకు అర్హులన్నారు. అదనంగా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9063082227, 9966448807 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
దెబ్బతిన్న అరటి తోటలను నేడు వైఎస్ జగన్ పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment