దంపతుల మృతికి కారకుడిని ఎలా వదిలేస్తారు?
ఎర్రగుంట్ల : దంపతుల మృతికి కారణమైన ఓమ్నీ వాహన డ్రైవర్‌ను పోలీసులు వదిలి పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులు కలమల్ల పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వివరాలు ఇలా.. కలమల్ల గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ఓమ్నీ వాహనం ఢీకొన్న సంఘటనలో వెంకటరాజారెడ్డి అనే ఆర్టీపీపీ కాంట్రాక్టు కార్మికుడు దుర్మరణం చెందగా అతని భార్య సుజాత తీవ్ర గాయాలతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదానికి కారణమైన ఓమ్నీ వాహన డ్రైవర్ వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రికి రాత్రే నిందితుడిని కూటమి పార్టీకి చెందిన ఆర్టీపీపీ ఉద్యోగి నారాయణస్వామి వచ్చి స్టేషన్ నుంచి విడిపించుకుని తీసుకెళ్లారు. ఇద్దరి మృతికి కారణమైన వాహన డ్రైవర్‌ను కలమల్ల ఎస్‌ఐ తిమోతి కూటమి నాయకుడి వెంట పంపించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం కలమల్ల పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్‌ఐను కోరితే ఆయన తమను బెదిరించాడంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎస్‌ఐ తీరు ముందు నుంచి వివాదాస్పదంగా ఉందని, ఎవరు డబ్బులు ఇస్తే వారికి ఎస్‌ఐ వత్తాసు పలుకుతాడని ఆరోపించారు. గ్రామస్తులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని గ్రామస్తులకు సంఘీభావం ప్రకటించారు. నిందితుడిని ఎలా వదిలేస్తారంటూ ఆయన మండిపడ్డారు. మృతుల కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న దంపతుల మృతదేహాలను సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాకు న్యాయం చేయండి..
తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఇద్దరు కుమార్తెలు తీవ్ర వేదనతో స్టేషన్ బయట బైఠాయించారు. తమకు న్యాయం చేయండి అంటూ బోరున విలపించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన తమకు దిక్కు ఎవరు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒకానొక దశలో గ్రామస్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో స్టేషన్ ఆవరణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిందితుడు వెంకటరమణ, అతన్ని విడిపించుకుని వెళ్లిన ఆర్టీపీపీ ఉద్యోగి నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని మృతుల సమీప బంధువు లింగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తిమోతి తెలిపారు.
కలమల్లకు చేరుకున్న పోలీసు బలగాలు..
ఎస్‌ఐ తీరును నిరసిస్తూ కలమల్ల గ్రామస్తులు స్టేషన్ బయట బైఠాయించడంతో ఎస్‌ఐ తిమోతి స్టేషన్‌లోనే ఉండిపోయారు. వెంటనే కొండాపురం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నుంచి సీఐలు మహమ్మద్ రఫీ, లింగప్ప, నరేష్‌బాబు, గోవిందరెడ్డి, గోపాల్‌రెడ్డి, దస్తగిరిలు, ఎస్‌ఐలు విద్యాసాగర్, ధనుంజయుడు, హృషికేశవరెడ్డి, పోలీసు సిబ్బంది స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. తర్వాత జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు కూడా స్టేషన్‌కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు.
రోడ్డు ప్రమాదం ఘటనలో నిందితుడిని
విడిపించుకుని వెళ్లిన కూటమి నాయకుడు
కలమల్ల ఎస్‌ఐ తీరుపై
గ్రామస్తుల మండిపాటు
పోలీసు స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన
గ్రామస్తులకు మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి
దంపతుల మృతికి కారకుడిని ఎలా వదిలేస్తారు?
Comments
Please login to add a commentAdd a comment