కేసీ కెనాల్‌ నీటి విడుదలకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

కేసీ కెనాల్‌ నీటి విడుదలకు చర్యలు

Published Wed, Mar 26 2025 1:51 AM | Last Updated on Wed, Mar 26 2025 1:49 AM

కేసీ

కేసీ కెనాల్‌ నీటి విడుదలకు చర్యలు

కడప సెవెన్‌రోడ్స్‌: కేసీ కెనాల్‌ ఆయకట్టుకు ఏప్రిల్‌ 15వ తేది వరకు నీరు అవసరమని జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటీలో కోరడంతో ఆ విషయాన్ని తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని కేసీ కెనాల్‌ (స్పెషల్‌) సబ్‌ డివిజన్‌ మైదుకూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు ఎస్‌.పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు తగు చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారని వెల్లడించారు. ఈనెల 22న సాక్షి దినపత్రికలో ‘ఇటు కేసీ చూడండి’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. జిల్లాలోని కేసీ కాలువ పరిధిలో ఉన్న పంటలకు ఇప్పటివరకు నీరు అందిస్తూనే ఉన్నామని తెలిపారు. అలాగే మైలవరం నుంచి కూడా ఆయకట్టుకు నీరందించే అంశాన్ని మైలవరం జలాశయ ఇంజనీరింగ్‌ అధికారులను సంప్రదిస్తామని పేర్కొన్నారు.

సేవా దృక్పథం అలవరచుకోవాలి

పులివెందుల రూరల్‌: ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం అలవరచుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళశారం కడప విద్యుత్‌ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం తరపున వేంపల్లెలోని అమ్మ ఆశ్రమం, లింగాల సమీపంలోని దీనబంధు మానసిక వికలాంగుల ఆశ్రమానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యుత్‌ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం అధ్యక్షుడు కె.రమేష్‌ కార్యదర్శి జి.నాగశేషారెడ్డి, కోశాధికారి ఎన్‌.నరసింహులు, వేంపల్లె సబ్‌ డివిజన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వెంకట నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మార్క్‌ఫెడ్‌ ద్వారా

శనగల కొనుగోలు

కడప సెవెన్‌రోడ్స్‌: ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా జిల్లాలో శనగ, మిను ములు కొనుగోలు కోసం ఈనెల 19 నుంచి కేంద్రాలు ఏర్పాటు చేశామని జాయింట్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–క్రాప్‌ నమోదు చేయించుకున్న రైతుల నుంచి శనగ క్వింటాలుకు రూ. 5650, మినుములు క్వింటాలుకు రూ.7400 చొప్పున కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ఈనెల 11 నుంచి సీఎం యాప్‌లో రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇచ్చామన్నారు. రైతులు ఇంకా ఎవరైనా తమ పేర్లు నమోదు చేసుకోకుంటే వెంటనే రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్లి నమోదు చేసుకోవాలన్నారు. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే శనగ, మినుములు కొనుగోలు చేస్తామన్నారు. పంట నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్నారు. జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, పెండ్లిమర్రి, పోరుమామిళ్ల, వీఎన్‌ పల్లె, వల్లూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, పులివెందుల, వేంపల్లె, వేముల, సింహాద్రిపురం, తొండూరు, కమలాపురంలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ముగిసిన వేలం పాట

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని దినసరి కూరగాయల మార్కెట్‌తోపాటు వాహనాల పార్కింగ్‌కు సంబంధించి కమిషనర్‌ మల్లికార్జున మంగళవారం బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఈ నెల 22న నిర్వహించాల్సిన వేలం పాట వాయిదా పడటంతో మంగళవారం నిర్వహించారు. దినసరి కూరగాయల మార్కెట్‌, వాహనాల పార్కింగ్‌కు మున్సిపాలిటీ రూ.1.29 కోట్లతో వేలం పాట ప్రారంభించగా షేక్‌ ముత్యాలపాడు గౌస్‌ బాషా రూ.1,60,80,000 పాట దక్కించుకున్నారు. జీఎస్టీతో కలిపి సదరు వ్యాపారి రూ.1,92,96,000 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే వేలం పాట రూ.1,33,75,415 పలికింది. అలాగే మాంసం, చేపల మార్కెట్‌కు సంబంధించి వేలం పాటను రూ.6,50,000 ప్రారంభించగా బి.నవీన్‌కుమార్‌ రెడ్డి రూ.6,66,000 పాటను దక్కించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వీరికి రుసుం వసూలు చేసుకునే హక్కు ఉంటుంది. రెవెన్యూ ఆఫీసర్‌ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కేసీ కెనాల్‌ నీటి  విడుదలకు చర్యలు 1
1/2

కేసీ కెనాల్‌ నీటి విడుదలకు చర్యలు

కేసీ కెనాల్‌ నీటి  విడుదలకు చర్యలు 2
2/2

కేసీ కెనాల్‌ నీటి విడుదలకు చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement