
ఆదివాసీలపై నరమేధాన్ని ఆపాలని 20న కడపలో సదస్సు
ప్రొద్దుటూరు క్రైం : దండకారణ్య ప్రాంతంలో ఆదివాసీలపై, మావోయిస్టులపై జరుగుతున్న నరమేధాన్ని కేంద్ర సాయుధ బలగాలు వెంటనే ఆపాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి చీమలపెంట వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సృజన కార్యాలయంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై సాగిస్తున్న యుద్ధాన్ని ఆపాలని ఈనెల 20న కడప గాంధీనగర్‌లోని ఇంజినీర్స్ భవన్‌లో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాల్లో విస్తరించిన నక్సలైట్లను తుదముట్టించి అడవుల్లో ఉండే విలువైన ఖనిజ సంపదనంతా అంబానీ, అదాని, ఎస్సార్ టాటా లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఈ నరమేధాన్ని కొనసాగిస్తోందన్నారు. జిల్లా సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, విరసం కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, మహిళా శక్తి కన్వీనర్ వడ్ల లక్ష్మీదేవి, సృజన సామాజిక వేదిక కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, నాస్తిక సమాజం కన్వీనర్ పల్లవోలు రమణ, ఆర్‌వీవీ సభ్యులు కడ్డి సుబ్బయ్య, పద్మ, హమీద్ బాషా, షరీఫ్, రిటైర్డు డీఆర్‌డీఏ పీడీ గోపాల్, ఆర్‌వీఎస్ హరిత తదితరులు పాల్గొన్నారు.