
వక్ఫ్ సవరణ బిల్లు రద్దు అయ్యే వరకు పోరాడతాం
కడప కల్చరల్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లు రద్దయ్యేంత వరకు తమ తీవ్ర నిరసనలు తెలుపుతూనే ఉంటామని వక్ఫ్ బోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఆదివారం వక్ఫ్ సవరణ బిల్లుపై నిరసన తెలుపుతూ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కడప నగరంలో ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ నగరానికి చెందిన పలు ముస్లిం సంఘాలు ఐక్యంగా ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. కడప నగరం నబీకోట నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్ మీదుగా నాగరాజుపేట, సీఎస్‌ఐ సర్కిల్, ఎస్‌ఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ వరకు సాగింది. అక్కడ పెద్ద ఎత్తున సమావేశమైన ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. ముస్లింల పట్ల ఒకవైపు ప్రేమ చూపుతూ, మరోవైపు వారి మనోభావాలు దెబ్బతీసేలా వక్ఫ్‌బోర్డు బిల్లుకు టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ఇవ్వడం పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేవలం ముస్లింలను టార్గెట్ చేసుకున్న బీజేపీ ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు ప్రభుత్వానికి సంబంధించినవి కావని, కేవలం ముస్లిం మైనార్టీల ఆస్తులు మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ఈ సవరణలు పూర్తిగా రద్దు చేసేంతవరకు ఈ పోరాటాలు చేస్తూనే ఉంటామని, అంతేకాకుండా రద్దు ఆలస్యం చేస్తే పోరాటాలు మరింత ఉధృతం చేయగలమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మత పెద్దలు, మైనార్టీలు పాల్గొన్నారు.
జాయింట్ యాక్షన్ కమిటీ నిరసన ప్రదర్శన