
అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వం
మైదుకూరు : అంబేడ్కర్ ఆశయాలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఐక్య ఉపాధ్యాయ సంఘం (యూటీఎఫ్) జిల్లా సహాధ్యక్షుడు వై.రవికుమార్ ధ్వజమెత్తారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కూటమి ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నామని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తూ బలవంతంగా పాఠశాలలను విలీనం చేస్తోందని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే ఈ విలీనాలను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగు మీడియం కనుమరుగై పోయిందని పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. సీఐటీయూ నాయకుడు షరీఫ్, ఆవాజ్ నాయకుడు ఖాదర్‌బాషా, ఎమ్మార్పీఎస్ నాయకుడు జీవన్ తదితరులు మద్దతు ప్రకటించారు. యూటీఎఫ్ నాయకులు గంగులయ్య, వనమాల రాము, రామకృష్ణ, తిరుపాలయ్య, లక్కినేని బాబు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.