తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ఇటీవల ప్రచారం జరిగినట్టుగా అధికార అన్నా డీఎంకేలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా సీఎం పన్నీరు సెల్వం రాజీనామా చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఆదివారం చెన్నై పోయెస్ గార్డెన్లో జరిగిన అన్నా డీఎంకే శాసనసభ పక్ష సమావేశంలో పన్నీరు సెల్వం రాజీనామా లేఖను శశికళకు అందజేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ శాసనసభ పక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలందరూ శశికళకు మద్దతు తెలిపారు. దీంతో శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైందని భావిస్తున్నారు.