మరో రెండు మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్ హై అలర్ట్ అయింది. ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన విలవిల్లాడుతున్న నగరం.. మరింత విపత్కర పరిస్థితిని ఎదుర్కొనబోతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్ర, శనివారాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించింది. నగరం పరిధిలోని పార్కులన్నింటినీ మూసివేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. అత్యవసర పరిస్థితి ఎదురైతే యుద్ధ ప్రాతిపాదికన సహాయ చర్యలు చేపట్టేందుకు సైన్యం సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్మీ అధికారులతోనూ సంప్రదించింది. ప్రధాన శాఖల అధికారులంతా తప్పనిసరిగా విధుల్లో ఉండాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ అధికారులు రాత్రిళ్లు కూడా కార్యాలయాల్లోనే ఉండాలని, 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించింది.