బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసు విచారణ తుది అంకానికి చేరుకుంది. ఈ కేసులో సల్మాన్ దోషేనని పేర్కొన్న ముంబై సెషన్స్ కోర్టు.. అతడికి విధించిన ఐదేళ్ల జైలు శిక్షను బాంబే హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తీర్పు రద్దుతోపాటు సల్మాన్ కు బెయిల్ కూడా లభించింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో సల్మాన్ దాఖలుచేసిన పిటిషన్ను స్వీకరించిన బాంబే హైకోర్టు తుది విచారణను ఈ నెల 30 ప్రారంభించనుంది. ఈ మేరకు ఒక ప్రకటన వెలువడింది. ఇదిలా ఉండగా సల్మాన్ బెయిల్ ను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2002లో ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్నవారిపై నుంచి సల్మాన్ కారు నడపడంతో ఒ వ్యక్తి మరణించగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో సల్మాన్ మోతాదుకు మించి మద్యం సేవించాడని రుజువైన కారణంగా ముంబై సెషన్స్ కోర్టు అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.