ప్రభుత్వం తప్పు చేసింది... హైకోర్టు మొట్టికాయలు వేసింది... తప్పును దిద్దుకోవాల్సిన ప్రభుత్వం మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది. అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీ చేతిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైకోర్టు సూచనలను సైతం తోసిరాజంటున్నారు. ఎవరెన్ని చెప్పినా సింగపూర్ కంపెనీకి అప్పజెప్పడమే తన లక్ష్యమన్నట్లుగా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియం (అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెమ్బ్‌కార్ప్)కు అప్పగించడానికి ఈనెల 3న జారీ చేసిన స్విస్ చాలెంజ్ టెండర్ నోటిఫికేషనే అందుకు తార్కాణం. రాజధాని ఏర్పాటు ప్రకటన వెలువడక ముందే ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’కు పాల్పడి తక్కువ ధరలకే భూములు కొట్టేసి రూ.లక్ష కోట్లు కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు అండ్ కో.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనూ అదే తరహాలో కాజేసేందుకు వ్యూహం పన్నింది.