డిసెంబర్ 30 తర్వాత కరెన్సీ ఇబ్బందులు తలెత్తకుండా ఆర్‌బీఐ వద్ద తగినంత కరెన్సీ ఉందని ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ చెస్టుల్లో సరిపడా నగదు నిల్వలు ఉన్నాయని మంగళవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ‘ఆర్‌బీఐ ఎప్పుడూ పూర్తి సన్నద్ధతతో ఉండేది. నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు తగినంత కరెన్సీ విడుదల చేయని రోజంటూ లేదు’ అంటూ జైట్లీ పేర్కొన్నారు. తగినంత కరెన్సీ నిల్వలతో ఎప్పుడూ ముందు జాగ్రత్తతో వ్యవహరించేదని, ప్రస్తుతం అదే పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. డిసెంబర్ 30 వరకే కాకుండా ఆ తర్వాత కూడా సరఫరా చేసేందుకు కొత్త కరెన్సీ అందుబాటులో ఉంచారని వెల్లడించారు.