సుదీర్ఘ కాలం పాటు ఊతం ఇచ్చిన హస్తాన్ని వదిలి ఇటీవలే కారెక్కిన సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ ఇంటికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం డీఎస్ ఇంటికి వెళ్లిన కేసీఆర్.. దాదాపు అరగంటకు పైగా అక్కడే ఉన్నారు. తన భోజనం కూడా డీఎస్ ఇంట్లోనే చేశారు. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మరికొందరు నాయకులు కూడా డీఎస్ ఇంటికి వెళ్లారు. అయితే కేసీఆర్ మాత్రం.. ఏకాంతంగా డి.శ్రీనివాస్తో చర్చించినట్లు తెలుస్తోంది. డీఎస్ సేవలను పార్టీకి ఏ రకంగా ఉపయోగించుకోవాలనే అంశంపై టీఆర్ఎస్ అధినేత ఇప్పటికే మల్లగుల్లాలు పడుతున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ లాంటి చిన్న పదవితో సరిపెట్టకుండా జాతీయస్థాయిలో లేదా రాష్ట్రస్థాయిలో సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఉందని సమాచారం. రెండు రోజుల్లో డీఎస్కు ఎలాంటి పదవి ఇస్తారనే విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.