అడగని విభజనపై అడుగులెందుకు? | Congress New Strategy: Why so hurry in State division? | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 21 2013 3:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

ఒక గీత చిన్నగా కనపడాలంటే.. దాని పక్కన పెద్ద గీత గీయాలి... ఒక సమస్యను మరుగుపర్చాలంటే అంతకన్నా మరో పెద్ద సమస్యను సృష్టిం చాలి... అనేది కుటిల రాజకీయ వ్యూహం! ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఇదే ఎత్తుగడను అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. మూడున్నరేళ్లుగా తెలంగాణ అంశంపై ఎటూ తేల్చకుండా నాన్చుతున్న కాంగ్రెస్ అధినాయకత్వం.. గత కొద్ది రోజులుగా ఏదో తేల్చేస్తున్నామంటూ హడావుడి చేస్తూ ఏ నిర్ణయమూ ప్రకటించకుండా.. ఎవరూ అడగని.. ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్న.. ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదనను అనూహ్యంగా తెరమీదకు తేవటాన్ని చూస్తే.. ఈ అనుమానాలే బలపడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌పై వివాదాన్ని తేల్చకుండానే.. ఎవరు అడిగారని రాయల తెలంగాణ ప్రతిపాదనను ప్రచారం చేస్తున్నారు? ఈ ప్రతిపాదనకు ఎలాంటి సూత్రబద్ధత ఉంది? కాంగ్రెస్ అధిష్టానం ఇలా కావాలనే కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తోందా? వచ్చే ఎన్నికల్లో ఇరు ప్రాంతాల్లో ఓట్లు, సీట్లపై దృష్టి సారించిన కాంగ్రెస్ ఈ కొత్త ఎత్తుగడ అవలంబిస్తోందా? లేక వివాదాన్ని తీవ్రం చేయటం ద్వారా దాటవేత వ్యూహం అనుసరిస్తోందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు.. తనకంటూ ప్రత్యేక సంస్కృతి గల రాయలసీమను చీల్చి.. కర్నూలు, అనంతపురం జిల్లాలు రెండిటిని తెలంగాణ జిల్లాలతో కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు వస్తున్న ఊహాగానాలపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ జ్వాలలు రాజుకుంటున్నాయి. సీమ ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తుతోంది. ఇదే ప్రతిపాదనను అధికారికంగా తెరపైకి తెచ్చేపక్షంలో పార్టీలన్నీ ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికలకు ముందు కొత్త ఎత్తుగడ? తెలంగాణ అంశంపై తన వైఖరేమిటో స్పష్టం చేయకుండా మూడున్నరేళ్లకు పైగా నాన్చుతున్న కాంగ్రెస్.. ఎన్నికల సమయం ఆసన్నమవటంతో ఇరు ప్రాంతాల్లో సీట్లు, ఓట్ల లెక్కలను బేరీజు వేసుకునే క్రమంలోనే రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరమీదకు తెస్తున్నట్లు తెలుస్తోంది. అసలు సమస్యను పక్కనపెట్టి రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు తేవటం ద్వారా వివాదాన్ని మరింత ఎక్కువ చేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచన చేస్తోందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణ బిల్లు పెడితే పార్లమెంటులో మద్దతిస్తామని బీజేపీ గట్టిగా చెప్తున్నా ఇంతకాలం పట్టించుకోకుండా.. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఎవరూ అడగని రాయల తెలంగాణ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఢిల్లీ నేతలు ప్రచారంలో పెట్టటం అనేక సందేహాలకు తావిస్తోంది. నెలాఖరులో సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్తున్న తరుణంలో.. రాయలసీమలోని రెండు జిల్లాలు కర్నూలు, అనంతపురంలను విడదీసి తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందంటూ ఢిల్లీ నేతలు సంకే తాలిస్తూ వ్యూహాత్మకంగానే సరికొత్త వివాదాన్ని తెరమీదకు తెస్తున్నారని.. ఇందులో కాంగ్రెస్ లక్ష్యమే వేరని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవెక్కడి ఓట్లు, సీట్ల లెక్కలు? రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయానికి వస్తే రాష్ట్రంలోని 294 శాసనసభ స్థానాలు, 42 లోక్‌సభ స్థానాల్లో.. కొత్తగా ఏర్పాటు చేసే రెండు రాష్ట్రాలకు చెరిసగం సీట్లు అనే లెక్కతో కాంగ్రెస్ అధిష్టానం అసలు ఊసులో లేని రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరమీదకు తేవటం పట్ల ఇప్పుడు సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమలోని రెండు జిల్లాలను విడదీసి తెలంగాణలో కలపటం ద్వారా.. ఆంధ్ర, రాయల తెలంగాణ ప్రాంతాల్లో 147 అసెంబ్లీ స్థానాల చొప్పున అలాగే 21 లోక్‌సభ స్థానాల చొప్పున ఇరు ప్రాంతాల్లో చెరిసగం విడదీసినట్టవుతుందన్న లెక్కలనుతెరమీదకు తెస్తోంది. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో కూడా ఈ రకమైన సీట్ల లెక్కలు రాలేదు. శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పింది? తెలంగాణ అంశంపై అధ్యయానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్.. ఏడాది పాటు రాష్ట్రంలో వివిధ వర్గాలు, సంఘాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించిన తర్వాత 2010 డిసెంబర్‌లో తన నివేదికను సమర్పించింది. అందులో రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆరు ప్రతిపాదనలు చేయగా.. మూడో ప్రతిపాదనగా రాయల తెలంగాణ అంశాన్ని ప్రస్తావించింది. ఈ ప్రతిపాదనను ఏ పార్టీ ఆమోదించలేదని స్పష్టంగా తెలిపింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేదా కచ్చితంగా విభజించాలన్న నిర్ణయానికి వస్తే మాత్రం కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఒక్క మజ్లిస్ పార్టీ (ఎంఐఎం) మాత్రం శ్రీకృష్ణ కమిషన్‌కు తన అభిప్రాయం తెలిపింది. ఈ ప్రతిపాదనను కమిషన్ తన నివేదికలో చర్చిస్తూనే దీన్ని రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు అంగీకరించబోరని కూడా స్పష్టంగా తేల్చిచెప్పింది. పైగా అలా చేస్తే ఉద్యమాలు మళ్లీ ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని కూడా పేర్కొంది. కొత్త వివాదం సృష్టించటమే వ్యూహమా? దేశంలోనే అత్యధికంగా లోక్‌సభ సీట్లను గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలహీనపడి అయోమయంలో కొట్టుమిట్టాడుతోందన్న విషయంపై ఆ పార్టీ అధిష్టానానికి స్పష్టమైన నివేదికలున్నాయి. అయితే సమీప కాలంలో ఎన్నికలు లేకపోవటంతో ఇంతకాలం తెలంగాణ అంశాన్ని నాన్చుతూ వచ్చిన కాంగ్రెస్.. అటు లోక్‌సభ, ఇటు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఎన్నికలను గట్టెక్కే వ్యూహంతో అడుగులు వేస్తోంది. గత కొద్ది రోజులుగా ఏదో హడావుడి చేస్తూ ఒకవైపు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతున్నట్లు, రెండోవైపు తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు సంకేతాలివ్వటం ద్వారా ఇరు ప్రాంతాల ప్రజలను గందరగోళంలోకి నెడుతోంది. శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఇరు ప్రాంతాలకు సంబంధించిన వాదనలతో ఆ కమిషన్ ముందుకు లెక్కలేనన్ని నివేదికలు వచ్చాయి. అయినప్పటికీ కొత్తగా రోడ్‌మ్యాప్‌లు అంటూ కొద్ది రోజులు హడావుడి చేసిన తర్వాత కోర్ కమిటీ సమావేశం జరిపింది. ఆ తర్వాత సీడబ్ల్యూసీ సమావేశమని పేర్కొంది. ఈ వరుస ఒకవైపు నడుస్తుండగానే ఇప్పుడు ఎవరూ అడగని, ఎలాంటి సూత్రబద్ధ ప్రాతిపదికా లేని రాయల తెలంగాణ అంటూ ఢిల్లీ నేతలు ఊహాగానాలకు తెరతీశారు. ఈ ప్రతిపాదనను ఎవరూ అంగీకరించరని తెలిసే.. ఉద్యమాలు ఊపందుకుంటాయని తెలిసే.. కాంగ్రెస్ నాయకత్వం ఈ వివాదాన్ని మరింత ముదిరేట్టు చేయటానికి ఒక పథకం ప్రకారం ఇలాంటి వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంచనావేస్తున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరమీదకు తేవటం ద్వారా వివాదం సృష్టించి, అశాంతిని రేకెత్తించి, సమస్యను మరికొంత కాలం సాగదీయటం, జాతీయస్థాయిలో బీజేపీ లాంటి పార్టీలను ఇరకాటంలో పెట్టటం వంటి అంశాలే కాకుండా.. రాష్ట్రంలోనూ ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీయొచ్చన్న ఎత్తుగడ ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. అసలు రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఆచరణకు దిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిగలదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్ణయం ఏదీ ప్రకటించకుండా మభ్యపెడుతూనే.. అంతిమంగా సమస్యను వచ్చే సాధారణ ఎన్నికల వరకు సాగదీసి.. ఆ ఎన్నికల ముందు ఇరు ప్రాంతాల్లో ఓట్లు, సీట్లు రాబట్టవచ్చన్నది కాంగ్రెస్ లక్ష్యంగా కనబడుతోందని చెప్తున్నారు. పరిశీలనలో ఉన్నట్లు చెప్తున్న ప్రతిపాదనలేవీ అఖిలపక్షంలో ఇతర పార్టీల ముందు పెట్టటం గానీ, భాగస్వాములతో చర్చించటం గానీ చేయకపోవటాన్ని బట్టి ఈ అనుమానాలను బలపరుస్తున్నట్లు పేర్కొంటున్నారు. పార్టీలు, ప్రజలు అందరూ వ్యతిరేకమే... ప్రస్తుతం ఉన్న పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే కావాలని, అందుకు భిన్నంగా జరిగితే ఆమోదించేది లేదని తెలంగాణ జేఏసీ ఇప్పటికే ప్రకటించింది. రాయల తెలంగాణను అంగీకరించేది లేదని టీఆర్‌ఎస్ స్పష్టంచేసింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తే పార్లమెంటులో మద్దతునిస్తామని బీజేపీ మూడేళ్ల కిందటే ప్రకటించింది. రాయలసీమ విభజనను ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. రాయలసీమను విభజించటాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా సుముఖంగా లేదు. రాయల తెలంగాణ ప్రతిపాదన పార్లమెంటు ముందుకొస్తే బీజేపీ మద్దతు లభించదని, దాంతో మొత్తం వ్యవహారం అటకెక్కుతుందన్న ఎత్తుగడ కూడా కాంగ్రెస్ నాయకత్వానికి ఉండొచ్చన్న అభిప్రాయం పార్టీల్లో నెలకొంది. ఒకవేళ ఇదే ప్రతిపాదనను ముందుకు తెస్తే ఆందోళన తీవ్రం చేసేందుకు ఇరు ప్రాంతాల పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement