నెల్లూరు జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు నగర శివార్లలోని పొర్లుకట్ట సమీపంలో ఉన్న ఓ ఇంట్లో బాణసంచా పదార్థాల వల్ల పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మృతిచెందారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఓ ఇంట్లో వంట చేస్తుండగాస నిప్పు రవ్వలు ఎగిరిపడి.. బాణాసంచాకు అంటుకోవడంతో వరుసగా 10 ఇళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఉదయం 9.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.