కోల్డ్‌స్టోరేజి దగ్ధమవుతోందన్న విషయం తెలిసిన లాలుపురం పంచాయతీ సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ మిర్చి నిల్వలు ఏమయ్యాయో అనుకుంటూ పరుగుపరుగున సంఘటన స్థలానికి చేరుకున్నారు. తమ టిక్కీలు ఎక్కడున్నాయో...ఎలా ఉన్నాయో..ఎవరిని అడగాలో తెలియక ఉదయం నుంచీ అక్కడే దిగాలుగా ఉండిపోయారు. ధరకోసం మిర్చిని కోల్డ్‌స్టోరేజిలో నిల్వచేస్తే ప్రమాదం ముంచుకొచ్చిందని, తక్కువ ధరకు అమ్ముకున్నా కొంతైనా ఇబ్బందులు తొలగేవని, ఇప్పుడు ఏం జరుగుతుందోనని పలువురు రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీనంగా ఒకరికొకరు గోడు చెప్పుకుంటూ కనిపించారు. గుంటూరు రూరల్ మండలం లాలుపురం పంచాయతీలోగల లక్ష్మిలావణ్య కోల్డ్ స్టోరేజి సోమవారం ఉదయం అగ్నిప్రమాదానికి గురికావడంతో అక్కడ కనిపించిన పరిస్థితి ఇది.